YCP Government Not Complete School Buildings: ఖర్చు చేయాల్సింది ఆరు కోట్ల రూపాయలు, పూర్తి చేయాల్సింది 30 శాతం పనులు. కానీ, ఆ పని వైసీపీ సర్కార్ వల్ల కాలేదు. ఐదేళ్లలో పురోగతేమీ చూపించలేదు. గత ప్రభుత్వంలో నిర్మించిన భవనాలనే వైసీపీ ప్రభుత్వం పాడుబెట్టింది. మైనార్టీ పిల్లలను కష్టాలు, కాలుష్యానికి వదిలేసింది. ఒకవైపు శిథిలావస్థకు చేరిన అద్దె భవనం, ఇంకోవైపు అంతస్థుల్లో నిర్మించిన శాశ్వత కట్టడం. ఇక్కడ ఇరుకు గదుల్లో తరగతులు, అక్కడ వినియోగంలోకి తీసుకురాని విశాల గదులు. ఇక్కడ ఏ మూలకూ చాలని వసతులు, అక్కడ సకల హంగులకు అవకాశాలు, ఇక్కడ కాలుష్యం, అక్కడ స్వచ్ఛమైన వాతావరణం, ఈ తేడాలు చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది. కష్టాల నుంచి విముక్తి కల్పించి పిల్లల్ని కొత్త భవనంలోకి తీసుకెళ్లాలి అనిపిస్తుంది కదా. కానీ మేనమామనని చెప్పుకునే సీఎం జగన్ వీళ్లను కష్టాలు, కాలుష్యానికే వదిలేశారు.
Dilapidated School Buildings: ఇది ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులం. నెల్లూరు ఆటోనగర్‌లో 15 ఏళ్లుగా అద్దె భవనంలో నడుస్తోంది. ఈ భవనం శిథిలావస్థకు చేరి భయానకంగా మారింది. బయటి పరిసరాలు కూడా అసౌకర్యంగా మారాయి. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. 280 మంది పిల్లలు ఐదు మరుగుదొడ్లతో సరిపెట్టుకోలేక గొడవలు పడుతున్నారు. పక్కనే ప్లాస్టిక్ పరిశ్రమ కూడా ఉండడంతో పిల్లలు హాయిగా చదువుకుని నిద్రపోయే పరిస్థితే లేదు. ఈ పరిస్థితుల నుంచి పిల్లల్ని గట్టెక్కించాలని గత తెలుగుదేశం ప్రభుత్వం అక్కచెరువుపాడు వద్ద మైనార్టీ గురుకులానికి 15 కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత భవన నిర్మాణం చేపట్టింది. ఇక్కడ తరగతి గదులు, పడక గదులు, మెస్ కోసం వేర్వేరు నిర్మాణాలు చేపట్టారు. 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 60 శాతం నిర్మాణాలు తెలుగుదేశం హయాంలోనే పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆ భవవాన్ని పాడుబెట్టింది. ప్రాంగణంలో ముళ్లకంపలు మొలిచాయి. గోడలకు పిచ్చి తీగలు పాకాయి. ప్రభుత్వ కక్ష రాజకీయానికి మైనార్టీ పిల్లల చదువులు బలయ్యాయని ముస్లిం సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
"పాఠశాలలో బోర్డులు సరిగా లేక డస్ట్ మీద పడుతుంది. పిల్లలు పడుకోవడానికి కూడా వసతులు బాగోలేదు. బిల్డింగ్ స్లాప్ పెచ్చులు ఊడిపోయి టీచర్ల మీద పడబోతున్నాయి. ఆటోనగర్ ప్రాంతం కావడంతో పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి". - నరేష్, మైనార్టీ బాలుర గురుకులం అధ్యాపకుడు
"ఒక్క గురుకుల పాఠశాల పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు కావాలా. టీడీపీ హయాంలో 70శాతం పనులు పూర్తైనా ఇంకా దీనిని పూర్తి చేయలేదు. టీడీపీ మొదలు పెట్టింది కాబట్టి మేము ఎందుకు చేయాలని అనుకుంటుందేమో ఈ ప్రభుత్వం".- రషీద్, ఆవాజ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి
గురుకులం సొసైటీల నిధులు రూ.40 కోట్లు దారి మళ్లాయి: గిరిజన నేతలు
YCP Government Not Credit Teachers Salaries: మూడేళ్లు మిన్నకున్న వైసీపీ ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరమే నాడు-నేడు కింద పనులు మొదలుపెట్టింది. కానీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారు పనులు అర్థాంతరంగా ఆపేశారు. పరిస్థితేంటని అధ్యాపకుల్ని ప్రశ్నిస్తే నాలుగు నెలలుగా మా జీతాలకే దిక్కులేదని వాళ్ల బాధలు చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. అద్దె భవనానికి నెల లక్ష రూపాయలు సమర్పించుకుంటున్న ప్రభుత్వానికి శాశ్వత భవనం పూర్తి చేయడానికి చేతులు రాలేదు. వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో భవనం పాడుబడుతుంది. మందుబాబుల ఆగడాలకు అడ్డాగా గురుకుల భవనం మారుతోంది.
చదువు, విశ్రాంతి, భోజనాలు తరగతి గదులే సర్వస్వం - గురుకులాల్లో జగనన్న వసతి కష్టాలు