Woman Voted Even Her Husband Dies : ఓ వైపు భర్త మృతిచెందినా తనలోని బాధను దిగమింగుకుని ఓటుపై అవగాహన కలిగిన చిరుద్యోగిగా ఓ మహిళ తన ప్రాథమిక హక్కు వినియోగించుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన గర్నెపూడి చిట్టెమ్మ గ్రామంలో వీవోఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త సింగయ్య(62) సోమవారం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఓటు విలువను చాటుతూ 178వ పోలింగ్ కేంద్రంలో ఓటేసి, మిగతావారికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఓటు విలువ తెలియక కొందరు ఇళ్లకే పరిమితమవుతుంటే పుట్టెడు దుఃఖాన్ని భరించి 80 ఏళ్ల వృద్ధురాలు తన కర్తవ్యాన్ని చాటారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన కొండమ్మ భర్త నంబూరి కొండయ్య (85) వృద్ధాప్యంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. అంత బాధలోనూ ఆమె తన బాధ్యత మరవకుండా ఓటేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని బీవీనగర్ ప్రాంతానికి చెందిన సురేశ్ తన 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. ప్రస్తుతం పీజీ చదువుతున్న ఆయన స్థానిక చిన్న కేఎస్ఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రానికి సోమవారం 9 గంటలకే వెళ్లి ఓటేశారు. రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటుహక్కు అని, ప్రతి పౌరుడు కచ్చితంగా వినియోగించుకోవాలన్నది తన అభిమతమని తెలిపారు.
ఎన్నికల విధులకు వెళ్తూ- రైలు ఢీ కొని తల్లి, కుమారుడు మృతి - Mother Son Dead in Train Accident
12 Deaths in Polling Day In Andhra Pradesh : ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. సోమవారం ఉదయాన్నే పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై ఏడుగురు, గుండెపోటుతో ముగ్గురు, రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. ఎన్నికల రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 12 మంది మృత్యువాత పడ్డారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖరకు చెందిన బిడ్డిక రాజారావు(80), అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన జయవరపు నాగయమ్మ(89), పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన నాగమణి(68), శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం బీజీ హళ్లికి చెందిన మారక్క(86), విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పాలవలసకు చెందిన సత్యం(80), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన అడుసుమిల్లి ఈశ్వరరావు (72) ఓటేసిన తర్వాత వారి ఇళ్లకు వెళ్తూ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలం విజరం గ్రామానికి చెందిన గోలిరత్న ప్రభాకరరావు (65), పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన పిల్లి సువర్ణరాజు(71), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకకు చెందిన కలగర వెంకటేశ్వరరావు (75) ఓటేసేందుకు వరుసలో నిలబడి గుండెపోటుతో మరణించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ముత్యాలంపాడుకు చెందిన మాగంటి నవకాంత్(38), కృష్ణా జిల్లా మేడూరుకు చెందిన గొర్కిపూడి నాగభూషణం(54) ఓటేసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లిలో పాలూరు పెంటమ్మ (65) ఓటేయడానికి వరుసలో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే వైద్య సిబ్బంది పరిశీలించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
ఎన్నికల వేళ కల్తీ మద్యం కలకలం- 20కి చేరిన మృతుల సంఖ్య! - Punjab Hooch Tragedy