Woman Gives Birth Nine Babies in Bapatla District : నిరక్షరాస్యత, కడు పేదరికం, వ్యవస్థల నిర్లక్ష్యానికి బాపట్ల జిల్లా చినగంజాంలో జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. తల్లీబిడ్డల సంరక్షణకు అలుపెరగకుండా పాటుపడుతున్నామని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతనే ఉండదు. నేటి ఆధునిక కాలంలోనూ ఓ తల్లి తొమ్మిది మంది బిడ్డలను కనడమంటే సాధ్యమా అని అనిపిస్తోంది. కానీ బాపట్ల జిల్లా చినగంజాంలో ఓ తల్లి తొమ్మిదో బిడ్డని కని మృత్యువాత పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం నిడమనూరులోని ఓ చెరువు గట్టు సమీపంలో చిన్నపాకలో మానికల సుబ్రహ్మణ్యం, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఎనిమిది సంతానం. 9వ సంతానం కడుపులో ఉండగా లక్ష్మి బలహీనంగా ఉంది. దీంతో ప్రసవానికి మూడు నెలల ముందే బాపట్ల జిల్లా చినగంజాంలోని జాలమ్మ కాలనీలో ఉంటున్న తమ బంధువుల చెంతకు చేరారు. అక్కడ ఉండేందుకు ఆవాసం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చివరికి లక్ష్మి అక్కకు చెందిన స్థలంలో చిన్నపూరి గుడిసె వేసుకొని తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి సంతానంలో ఇద్దరి పిల్లల వయసు పదేళ్లు దాటడంతో పెద్ద కుమారుడ్ని పర్చూరు మండలం, ఉప్పుటూరులో గొర్రెల కాసే పనికి కుదిర్చాడు. మరో కుమారుడ్ని మార్టూరు మండలం కొలలపూడిలో అదే పనిలో పెట్టాడు. ఈ దంపతులకు రెండు వారాల క్రితం ఆడపిల్ల జన్మించగా అనారోగ్యంతో తల్లి చనిపోయింది.
ఈ నేపథ్యంలోనే ఆ శిశువును పురిట్లో బిడ్డను పోగొట్టుకున్న బాలింత కోరడంతో తండ్రి ఆమెకు అప్పగించాడు. నిబంధనల ప్రకారం దత్తత జరగకపోవడంతో ఆ పాపను శిశు సంరక్షణ కేంద్రంలో అధికారులు చేర్చారు. అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో ఆ బిడ్డలు ఇప్పుడు దిక్కులేని వారయ్యారు. తండ్రి పనులు వెళ్లితే వారి ఆలనాపాలన చూసే వారు లేక అనాథలుగా మిగిలారు.
చిన్నారుల పెద్ద మనసు - వరద బాధితుల కోసం పాకెట్ మనీ - SCHOOL CHILDREN HELP
పిల్లల పరిస్థితి దయనీయం : వారు ప్రస్తుతం ఉంటున్న గుడిసెలో పడుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే తల దాచుకోవడానికి లేదు. వంట వండుకోవడానికి రెండు గిన్నెలు తప్ప వస్తువులు ఏవీ లేవు. కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. పిల్లలకు సరైన దుస్తులు, ఆధార్‌కార్డులు లేవు. పిల్లలు బడికి వెళుతున్నారా అని సుబ్రహ్మణ్యంను అడిగితే ఇద్దరిని పంపిస్తున్నట్లు తెలిపాడు. ఇంత మంది పిల్లలను ఎలా పోషిస్తావని అతనిని అడిగితే కాలువల్లో చేపలు పట్టుకొని బతికిస్తానని, కూలీ పనులకు వెళ్లి తన బిడ్డలను పెంచుతానని ధీమాగా చెప్పడం గమనార్హం.
కుటుంబ నియంత్రణ (family planning) పాటించాలని, అధిక సంతానం వల్ల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పే వైద్య ఆరోగ్యశాఖకు సుబ్రహ్మణ్యం వంటి వ్యక్తులు ఎప్పుడూ తారసపడలేదా? పిల్లలకు పోలియో చుక్కలు వేసే సమయంలో కానీ, కాన్పుల సమయంలో అయినా వైద్య సిబ్బందికి ఇలాంటి వారు కనిపించలేదా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
తల్లీబిడ్డ సంరక్షణ పర్యవేక్షించే స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి ఇంతమంది పిల్లలున్నారనే విషయం ఎందుకు గుర్తించ లేదు. బడి బయట పిల్లలు లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తిరిగి బడుల్లో చేర్పిస్తున్నామని చెప్పే విద్యాశాఖ లెక్కల్లో ఈ పిల్లలు ఎందుకు చేరలేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.