International Womens Day Celebrations in AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వివిధ రంగాలకు చెందిన మహిళలకు పురస్కారాలు అందజేశారు. పలువురు ప్రముఖులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ-జనసేన ప్రభుత్వంలో మహిళలకు భద్రత: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో పార్టీ వెలుగులు నింపిందని స్పష్టం చేశారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకే "మహాశక్తి పథకం" ప్రకటించామన్నారు.
ఈ పథకం కింద చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15 వేల చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా మహిళలకు 22 సంక్షేమ పథకాలను టీడీపీ అమలు చేసిందని పేర్కొన్నారు. ప్రతి తల్లి, చెల్లి, ప్రతి ఇల్లు బాగుంటేనే నిజమైన మహిళా సాధికారిత అని ఆ దిశగా అడుగులు వేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా మహిళా దినోత్సవం - మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలన్న మంత్రి సీతక్క
మహిళా సాధికారిత ఉంటేనే అభివృద్ధిసాధ్యం: లింగవివక్ష లేని సమాజం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి మహిళా సాధికారిత ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. పురాణాల నుంచి మహిళలకు ప్రత్యేక గౌరవం ఉండేదన్న ఆయన ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన మహిళలకు పురస్కారాలు అందజేశారు.
మహిళల రక్షణ, సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వ బాధ్యత: మహిళల రక్షణ, సంక్షేమం టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వ బాధ్యత అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి స్త్రీకి మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన 'నా అక్కలు, నా చెల్లెమ్మలు' అని నాలుక చివరి మాటలతో సరిపుచ్చమని పేర్కొన్నారు. నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటుందని.. ఇంట్లో అమ్మ, అక్క, చెల్లే కాదు మహిళని చూసినా మల్టీ టాస్కింగ్ తెలుస్తుందని అన్నారు. ఈ క్రమంలో ప్రతి ఆడపడచు రక్షణ, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.
మగువా నీకేది సాటి.. RFCలో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవం
వైసీపీ ప్రభుత్వం లక్షలాది మంది మహిళల మాంగళ్యాలను తెంచింది: మానవాళికి ప్రాణం పోసే మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషెస్ తెలిపారు. మహిళలు లేని లోకాన్ని ఊహించుకోవటమే కష్టమన్న ఆయన గత ఐదేళ్లుగా సీఎం జగన్ పాలనలో మహిళలు పడిన అవస్థలు, ఆందోళన వర్ణించటం సాధ్యంకాదని పేర్కొన్నారు. దాడులు, దౌర్జనాలతో మహిళాలోకం బిక్కచచ్చిపోయిందన్నారు. కల్తీ మద్యంతో వైసీపీ ప్రభుత్వం లక్షలాది మంది మహిళల మాంగళ్యాలను తెంచిందని మండిపడ్డారు.
మహిళల్ని మహారాణుల్లా గుర్తించే ప్రభుత్వం ఏర్పడనుంది: సొంత చెల్లెళ్లను, కన్న తల్లిని ఇంట్లోంచి గెంటేసిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. మహిళలు మహారాణుల్లా బతకాలని చంద్రబాబు నాయుడు అహర్నిశలు అండగా నిలిచారని, అంతర్జాతీయ వేదికలపై కూర్చోబెట్టారని గుర్తుచేశారు. మరో 40 రోజుల్లో మహిళా పక్షపాత ప్రభుత్వం రాబోతుందన్న అచ్చెన్నాయుడు మహిళల్ని మభ్యబెట్టే రోజులు పోయి మహారాణుల్లా గుర్తించే ప్రభుత్వం ఏర్పడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.