Why We Say Arjuna Phalguna during Thunderstorm: సాధారణంగా ఉరుములు, మెరుపులతో తుపాను వస్తే భయపడనివారుండరు. భారీ వర్షం పడుతున్నప్పుడు చెట్లపై ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంది. పిడుగు పడేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా భయపడతారు. అలాంటి సమయంలో అర్జునా ఫాల్గుణ అనే జపం చేయాలని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఉరుము ఎలా ఏర్పడుతుంది? ఉరుము తుపానుపై అర్జునా ఫాల్గుణ జపం ఎందుకు? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. అర్జునా అనడం వెనుక శాస్త్రీయ కారణం ఉందా? తుపాను సమయంలో ఈ జపం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. అదెలాగో తెలుసుకుందామా !
పిడుగులు సంభవించినప్పుడు అర్జునా ఫాల్గుణ జపం ఎందుకు?: ఉరుములతో కూడిన వర్షం సంభవించినప్పుడు అర్జున ఫాల్గుణ అనే జపం చేయాలని చెప్పడం వెనక మహాభారత ఇతిహాసంలో ఒక చిన్న కథ ఉంది. మహాభారతంలో అజ్ఞాతవాసం ముగియటంతో అర్జునుడు తన యథార్థ రూపాన్ని దాల్చుతాడు. ఆయుధాల కోసం ఉత్తరుడిని అర్జునుడు తాను ఆయుధాలు దాచిన శమీ వృక్షం(జమ్మి చెట్టు) వద్దకు తీసుకెళ్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా ఆవులను తరలించుకుని పోతున్న దుర్యాధన, కర్ణాదులను ఎదురించేందుకు ఆయుధాలను శమీ వృక్షం మీద నుంచి కిందకు తీసుకుని రమ్మంటాడు.
అయితే ఆయుధాలు చూసిన ఉత్తరుడికి అవి సర్పాలుగా కనిపిస్తాయి. దీంతో భయపడుతున్న ఉత్తరుడికి అర్జునుడు తన పది పేర్లైన అర్జున, ఫాల్గుణ, విజయ పార్థ, కిరీటి, శ్వేతవాహన, భేబత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ నామాలు జపించమని చెబుతాడు. దీంతో ఉత్తరుడికి భయం తొలగి ఆయుధాలను చెట్లపైనుంచి కిందకు తీసుకుని వస్తాడు. అప్పటి నుంచి భయాన్ని పోగొట్టే మంత్రంగా దీన్ని పెద్దలు చెబుతారు.
ఉరుము ఎలా ఏర్పడుతుంది?: మెరుపు భూమిని చేరే కొన్ని సెకన్ల పాటు మేఘం, భూమి మధ్య ప్రయాణిస్తున్నప్పుడు, అధిక-ఉష్ణోగ్రత మెరుపు గాలిలోని అణువులను వేడి చేస్తుంది. వేడి గాలి విస్తరించినప్పుడు వచ్చే శబ్దాన్నే 'ఉరుము'గా పిలుస్తుంటారు. పిడుగులు పడినప్పుడు దాని నుంచి పెద్ద శబ్దం రావడంతో చిన్న పిల్లలకు కాస్త భయం ఎక్కువ. ఆ సమయంలో పెద్దలు అర్జునా అని చెబుతారు. అంతే కాకుండా అర్జునుడు అనే కృష్ణ భక్తుడి పేరు చెబితే ఉరుము శబ్దం వినపడదని పెద్దలు చెబుతారు. అయితే అర్జునా అనడం వెనుక శాస్త్రీయ కారణం ఉందంటున్నారు నిపుణులు.
బలమైన ఉరుము వచ్చినప్పుడు, దాని నుంచి వచ్చే శబ్దం వల్ల కొందరికి చెవులు మూసుకుపోతాయి. దీంతోపాటు చెవి నుంచి ఒక రకమైన శబ్దం వస్తుంది. ఆ సమయంలో మనం అర్జునా అని అన్నప్పుడు మన చెవులు మూసుకోవు. ఎందుకంటే దీనికీ ఒక కారణం ఉంది. 'అర్' అని చెప్పేటప్పుడు నాలుక మడిచి పై దవడను తాకుతుంది. 'జు' అని చెప్పినప్పుడు, నోరు కుదించి గాలి విడుదల అవుతుంది. 'నా' అని చెప్పేటప్పుడు నోరు పూర్తిగా తెరుచుకుని గాలి బయటకు వస్తుంది. ఇలా గాలి బయటకు రావడం వల్ల చెవికి అడ్డుపడదు.
ఏదీ ఏమైనా ఎప్పటినుంచో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినప్పుడు, భారీ శబ్ధాలతో పిడుగులు పడినప్పుడు అర్జునా-ఫల్గుణ అనడం సర్వసాధారణమైంది.