Water Release in pattiseema Eluru District : ఏలూరు జిల్లా పట్టిసీమ నుంచి కృష్ణా నదికి గోదావరి నీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. మొత్తం 14 పంపులను అధికారులు స్విచ్ ఆన్ చేశారు. వాటి ద్వారా సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీరు కృష్ణా నదికి చేరుతోంది. గోదావరికి ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో పట్టిసీమ పంపులను ఆన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
2014-2019 సంవత్సరం మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పట్టిసీమకు రూపకల్పన చేశారు. అప్పట్లోనే దీనికి మొదటి సారిగా నీటిని విడుదల చేశారు. అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసింది. తరువాత మళ్లీ ఇప్పుడు ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరుణంలో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు వలన సకాలంలో వ్యవసాయ భూములకు నీరు అంది పొలాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. దీని ద్వారా కృష్ణా జిల్లాలో గల పలు వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయి.
వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో: ఇటీవలే కాలంలో వర్షాలు సమృద్ధిగా పడటంతో ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాంతో పాటు వరద నీటిని ఒడిసిపట్టుకునే విషయంలో జలవనరుల శాఖ అధికారులు సఫలీకృతమయ్యారు. దీనిపై జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ దేశాన్ని కరవురహిత రాష్ట్రంగా మార్చాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గమని ఆయన ఉధ్ఘాటించారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబే అని ఆయన వెల్లడించారు. కష్ట కాలంలో సైతం రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల ధృడ నిశ్చయం కలిగి ఉన్న ప్రభుత్వం తమదని ఆయన పేర్కొన్నారు.
పట్టిసీమకు గోదావరి పరవళ్లు - ఆనందంలో అన్నదాతలు - Pattiseema Lift Irrigation Project