గమ్య నగరి విశాఖకు వచ్చే పర్యాటకులు కైలాసగిరికి వెళ్లకుండా ఉండరు. ఆ కొండ మీది నుంచి సముద్ర తీరం అందాలు కనువిందు చేస్తాయి. మరో వైపు విస్తరించిన నగరం ముచ్చటగొలుపుతుంది. కొండల మధ్య వీక్షణ ప్రదేశాలు మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పటికే రోప్ వే, చిన్న రైలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) చర్యలు చేపట్టింది. కొండపై అన్ని వైపులా నూతన వసతులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
నక్షత్రశాల :
నిధులు : రూ.37 కోట్లు
వచ్చేవి : యువత, విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానం వైపు నడిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
ప్రస్తుతం : 7 ఎకరాల్లో నిర్మించాలనేది ప్రణాళిక. బిర్లా సైన్స్ కేంద్రం (Birla Science Centre) సహకారంతో నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు లేఖ రాశారు.
సాహస కృత్యాలు :
నిధులు : రూ. నాలుగు కోట్లు
వచ్చేవి : జిప్ లైనర్, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి
ప్రస్తుతం : జిప్ లైనర్, స్కై స్కైక్లింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. కొండ మీద మెట్ల మార్గం వైపు 150 మీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. నడక వంతెన అందుబాటులోకి వచ్చేసరికి కొంత సమయం పట్టనుంది.
రివాల్వింగ్ రెస్టారెంట్ :
నిధులు : రూ.18 కోట్లు
వచ్చేవి : సముద్ర తీరం కనిపించేలా భోజనశాలలు, విశ్రాంత గదులు, సమావేశ మందిరాలు ఈత కొలను ఉంటాయి. పర్యాటకులు బస చేసేందుకు వీలుగా హరిత గృహాలు నిర్మిస్తారు. ఇక్కడ ఉన్న అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసి రెస్టారెంట్‌గా మార్చాలనేది ఆలోచన.
ప్రస్తుత పరిస్థితి : ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉంది.
శక్తి ఉద్యానవనం :
నిధులు : రూ.50 కోట్లు(సుమారు)
వచ్చేవి : సంప్రదాయ, సంప్రదాయేతర విద్యుత్తుశక్తి నిర్వహణ నమూనాలు, ప్రదర్శనలు రానున్నాయి. కృత్రిమ మేధతో ప్రత్యేక ప్రదర్శనలుంటాయి. సాహస, ఉల్లాస క్రీడల ద్వారా విద్యుత్తు ఉత్పతయ్యే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుతం : ఈ ప్రాజెక్టుకు వీఎంఆర్‌డీఏ స్థలం కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ.34 కోట్ల సాయం అందించనుండగా మరికొంత ఈపీడీసీఎల్ సమకూరుస్తుంది. దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయి.
విజ్ఞాన సందర్శనాలయం :
నిధులు : రూ.4.69 కోట్లు
వచ్చేవి : ఆర్ట్ గ్యాలరీ, అంతరిక్ష విజ్ఞానాలయం, అగ్‌మెంటెడ్ రియాల్టీ, లైవ్ ఆర్ట్ సందర్శనాలయం
ప్రస్తుతం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో దీన్ని ఆరంభించారు. ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు అవుతోంది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇది ఒక్కడో కీలక నిర్మాణం కానుంది.
బృహత్తర ప్రణాళిక :
నిధులు : రూ.20 కోట్లు,
ఉపయోగం : పర్యాటకుల అవసరాలకు వీలుగా కైలాసగిరి కొండమొత్తానికి బృహత్తర ప్రణాళిక రూపొందించనున్నారు. ఆదాయ వనరులు సృష్టించే మార్గాలపై కసరత్తు చేస్తారు. వీఎంఆర్‌డీఏ ఖజానాకు ఆదాయం పెంచనున్నారు.
కరోనా దెబ్బకు కుదేలైన కైలాసగిరి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటకం