Visakha Steel Plant Employees Happy on Kumaraswamy Statement : ఎన్నో బలిదానాలతో "విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" అని పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమంత్రి శుభవార్త చెప్పారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. కాకపోతే ఈ విషయాన్ని ప్రధాని అనుమతితో వెల్లడిస్తామని తెలిపారు. కేంద్రమంత్రి కుమార స్వామి నిర్ణయంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం గత మూడున్నరేళ్లగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్లాంట్ పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడంతో ప్రైవేటీకరణ తప్పదనే వార్తలతో కార్మికుల్లో నిరాశ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కుమార స్వామి స్టీల్ ప్లాంట్ పర్యటన కార్మికుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. గురువారం ప్లాంట్‌లో పర్యటించిన కుమార స్వామి అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులు, కార్మికుల నుంచి వినతులు స్వీకరించారు.
ఇక్కడి పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తామని కుమారస్వామి తెలిపారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు ఉక్కు సంకల్పంతో కేంద్రమంత్రి కుమారస్వామి వచ్చారని కూటమి నేతలు అన్నారు. కేంద్రమంత్రి ప్రకటనకు అనుగుణంగా సానుకూల నిర్ణయం వెలువడితే ప్లాంట్ త్వరలోనే లాభాల బాట పడుతుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
"విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామని ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ విషయం చెప్పటానికి ముందు నేను ప్రధాని మోదీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆర్ఐఎన్ఎల్కు సంబంధించిన విషయాలన్నీ ప్రధానికి నివేదించి ఆయన్ను ఒప్పించాలి. ఇప్పటికే ఈ విషయాలన్నింటిపై అధికారులతో చర్చించి ఓ నివేదిక తయారు చేస్తున్నాం. ఆర్ఐఎన్ఎల్ను తిరిగి గాడిన పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నాం." - కుమార స్వామి, కేంద్రమంత్రి
"స్టీల్ ప్లాంట్‌లో పర్యటించిన కేంద్రమంత్రి కుమార స్వామి కార్మికలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. వారి నుంచి వినతులను కూడా స్వీకరించారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చేయబోమని, దీనిపై భయం వద్దని కార్మికులకు భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కుమారస్వామి ఉక్కుసంకల్పంతో వచ్చారు." - కూటమి నేతలు