Vijayawada Boy Excelling in Yoga : ఈ అబ్బాయిని చూడండి ఒళ్లును విల్లులా విరుస్తూ, ఎంతో క్లిష్టమైన ఆసనాలను చాలా సునాయాసంగా వేసేస్తున్నాడు. రకరకాల భంగిమల్లో యోగాలు చేస్తూ చూపు పక్కకు తిప్పుకోనీయకుండా ఆకర్షిస్తున్నాడు. జగ్గీవాసుదేవ్, బాబా రామ్‌దేవ్ వంటి యోగా గురువులు లాగా ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నాడు. వాస్తవానికి ఎన్నో ఏళ్ల కృషి, కఠోర శ్రమ ఉంటేనే ఇంతటి నైపుణ్యం కలిగిన ఆసనాలు వేయలేం.
Dheeraj Srikrishna in Yoga : విజయవాడకు చెందిన ధీరజ్ శ్రీకృష్ణ మాత్రం ఎవరి సాయం లేకుండా ఆరేళ్ల వయసు నుంచే యోగ చేసేవాడు. ప్రస్తుతం ధీరజ్ భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కరాటే, డాన్స్‌తోపాటు వివిధ రంగాల్లోనూ ముందుండేవాడు. క్లిష్టమైన ఆసనాలు వేసే ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించారు. 2021లో దిల్లీలో మూడు నెలల పాటు అతడికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. 11 ఏళ్ల నుంచే ప్రొఫెషనల్ యోగా ప్రారంభించాడు. తెల్లవారుజామున 5 గంటలకే లేచి ఆసనాలు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇలా ట్రెడిషనల్ ,ఆర్టిస్టికల్ యోగాలో మెళుకువలు నేర్చుకుని సత్తా చాటుతున్నాడు ధీరజ్.
ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన చిన్నారిగా ధీరజ్ రికార్డు సాధించాడు. గతంలో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ అవార్డు, వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్స్‌లోనూ చోటు సంపాదించుకున్నాడు. ఇటీవల రుషికేశ్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొని, బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. రుషికేశ్‌లో అతని ప్రతిభను చూసి యోగా గురువులే ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. ప్రధాని మోదీ సైతం శభాష్ ధీరజ్ అనే స్థాయిలో ప్రదర్శనిచ్చాడు.
ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే లక్ష్యం : నిత్యం యోగా చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఏకాగ్రత పెరిగి పాఠాలు సులువుగా అర్థమవుతున్నాయని ధీరజ్ శ్రీ కృష్ణ చెబుతున్నాడు. ఒలంపిక్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించడమే లక్ష్యమని అంటున్నాడు. ధీరజ్ విజయ ప్రస్థానంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిది. ఎక్కడ పోటీలున్నా దగ్గరుండి తీసుకెళ్లి బాలుడ్ని ప్రోత్సహిస్తుంటారు. కుమారుడి ప్రతిభను చూసి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు.
"ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తాను. ఇటీవల అంతర్జాతీయ స్థాయి పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది. సుమారు 20 దేశాలవారు పాల్గొన్నారు. ఒలంపిక్స్‌లో పాల్గొని యోగాలో బంగారు పతకం సాధించడమే లక్ష్యం." - ధీరజ్ శ్రీకృష్ణ, బంగారు పతక విజేత
"మాకు చాలా సంతోషంగా ఉంది. మూడుసార్లు వరుసగా మా బాబు బంగారు పతకాలు సాధించాడు. తనూ బాగా ప్రాక్టీస్ చేస్తాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా అసోసియేషన్లు మాకు చాలా సపోర్ట్ చేశాయి. మా అబ్బాయి ప్రతిభను చూసి మేము ఎంతో గర్వపడుతున్నాం." - నాగరాజు, ధీరజ్ తండ్రి
దేశవిదేశాల్లో 70ఏళ్లుగా యోగా ట్రైనింగ్- 93ఏళ్ల ఏజ్‌లోనూ ఏ ఆసనమైనా ఈజీగా! - 93 YEAR OLD YOG TEACHER
గంట 40 నిమిషాలు నీటిపై తేలుతూ ఈ యువకుడి యోగాసనాలు.. మీరు చూశారా?