Nominations for Lok Sabha and Assembly Polls: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్‌సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు నిర్వహిస్తూ, కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ఈయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మంగళగిరిలోని సీతారామ కోవెల ఆలయం వద్ద నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజులు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో సుమారు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులంతా లోకేశ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా చదలవాడ అరవిందబాబు ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన చదలవాడ రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. నరసరావుపేట లోక్‌సభ కూటమి అభ్యర్థఇ లావు శ్రీకృష్ణదేవరాయలు కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారిశివశంకర్‌కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు.
కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ కూటమి అభ్యర్థఇ వర్ల కుమార్ రాజా, ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 24న మరోసారి నామినేషన్ వేస్తానని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పావని నామినేషన్ దాఖలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి జి. శ్రీనివాస్ నాయడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని MRO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరపున ఆయన సతీమణి హేమలత, కుమారుడు విజయసింహ, కుటుంబ సభ్యులు కలిసి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఉరవకొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో తొలి నామినేషన్ పయ్యావుల కేశవ్‌దేనని ఈసీ తెలిపింది.
తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులివర్తి నాని నామినేషన్ దాఖలు చేసేందుకు భార్య సుధాతో కలిసి తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లగా.. ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. నాని సతీమణి వాహనాన్ని పోలీసులు కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. దీంతో కొద్దిసేపటి తర్వాత పులిపర్తి సుధా వాహనాన్ని పోలీసులు అనుమతించారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి RDO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తరఫున ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లా లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా భూపేష్ రెడ్డి తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబసభ్యుల సమక్షంలో కలెక్టరేట్ లోని ఆర్వో విజయరామరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరఫున ఆయన సతీమణి అరుణ నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేటప్పుడు ఎంపీ అవినాష్‌రెడ్డి ఆయన పక్కనే ఉన్నారు. మైలవరం మండలం దన్నవాడకు చెందిన మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జమ్మలమడుగు స్థానానికి స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి నామనినేషన్ దాఖలు చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అన్న వైసీపీ పార్టీ అభ్యర్థి మహబూబ్ బాషా, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున అవ్వరు మల్లికార్జున, స్వతంత్ర అభ్యర్థిగా సుధీర్ వర్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. ముందుగా వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తరువాత తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమి అభ్యర్థులను పంపించే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయానికి వైసీపీ అభ్యర్థులు కూడా రావడంతో గొడవ జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను చెదరకొట్టడంతో గొడవ సద్దుమణిగింది. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు.
కర్నూలు పార్లమెంటు కూటమి అభ్యర్థి బస్తిపాడు నాగరాజు కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. నాగరాజుతో పాటు ఆయన సతీమణి జయలక్ష్మీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టారేణుక నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వైసీపీ అభ్యర్థగా కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్ వేశారు.
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపేటలోని వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా వెళ్లి పత్రాలు సమర్పించారు. లోక్‌సభ కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద రావు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. విశాఖ జిల్లా భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తహసీల్దార్ కార్యాలయంలోనామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా తరలివెళ్లిన గంటా మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.