Vamsadhara Right Canal Viaduct Damage : శ్రీకాకుళం జిల్లాలో వంశధార కుడికాలువకు అనుసంధానంగా నిర్మించిన వయాడక్ట్ నిర్వహణ లోపంతో శిథిలమవుతోంది. కొన్నేళ్లుగావయాడక్ట్ నుంచి నీరు లీకేజీ అవుతున్నా, పెచ్చులు ఊడుతున్నా పట్టించుకున్న వారే లేరు. ఎక్కడికక్కడ పెచ్చులూడిపోతున్నా, సైడ్‌వాల్స్ విరిగిపోతున్నా అధికారులకు చీమ కుట్టినట్లైనా లేదు. క్రమంగా పక్కకు ఒరుగుతున్న వయాడక్ట్ ఎప్పుడు కోలుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐదు సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఒకసారి కూడా మరమ్మతులు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.
అనుకోని ఘటన జరిగితే పెద్ద ముప్పు తప్పదు : శ్రీకాకుళం రూరల్ పరిధిలోని భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో బొడ్డేపల్లి రాజగోపాల్ రావు వంశధార ప్రాజెక్టు పేరుతో అక్కులపేట ఎత్తిపోతల పథకం నిర్మించారు. 30 కిలోమీటర్ల మేర సాగే వంశధార కుడి కాలువకు అనుసంధానంగా 2.2 కిలోమీటర్ల దూరం వయాడక్ట్ నిర్మించారు. దీన్ని ప్రారంభించి 16 ఏళ్లు దాటినా పర్యవేక్షణ మాత్రం కోరవడింది. ఎక్కడికక్కడ నీరు లీకేజీ అవుతుండడం గోడల నుంచి పేచ్చలు ఊడి పడుతుండడంతో క్రమంగా పక్కకు ఒరుగుతోంది.
గేదలవాని పేట వద్ద వయాడక్ట్ కింది నుంచే వాహనదారులు నిత్యం తిరుగుతుంటారు. అనుకోని ఘటన జరిగితే పెద్ద ముప్పు తప్పదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు పాలనలో కనీసం మరమ్మతులు చేపట్టక పోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.
22 వేల పైగా ఎకరాలకు సాగునీరు : వయాడక్ట్ ద్వారా చివర భూములుకు సాగునీరు అందించేందుకు గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16.77 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 22 వేల పైగా ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ప్రస్తుతం లేకేజీల కారణంగా ఆ మేరకు సాగుకు నీరు అందడం లేదని అన్నదాతల వాపోతున్నారు.
చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలి : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళిన ప్రతిసారి వచ్చి చూసి వెళ్లిపోవడమే తప్ప పరిష్కారం చూపలేని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని రైతన్నలు కోరుతున్నారు.