Girl Child Death in Punganur: చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి హత్య ఘటనలో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం తీసుకున్న మూడున్నర లక్షల అప్పును తీర్చమన్నందుకే ఆరేళ్ల చిన్నారిని అంతమొందించారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఈ ఘటనపై వస్తున్న అనేక ఊహాగానాలను ఆయన కొట్టిపడేశారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లోను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి హత్యోదంతాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చిన్నారి హత్యపై వస్తున్న నిరాధార ఆరోపణలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులను మంత్రులు పరామర్శించారు. నిందితులను వదలబోమని తెలిపారు. మరోవైపు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. బాలికపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. ఆర్ధిక లావాదేవీలతో బాలికను హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు : చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. హోంమంత్రి అనితతో పాటు మంత్రులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలిక తండ్రిని సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. మరోవైపు చిన్నారిపై అత్యాచారం జరిగిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చిత్తూరు ఎస్పీ తెలిపారు.
హంతకులను వదిలిపెట్టబోమన్న మంత్రులు, ధైర్యంగా ఉండాలని బాలిక కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత, చిన్నారిని అత్యాచారం చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. శవపరీక్ష నివేదికలోనూ అత్యాచారం జరగలేదని తేలిందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు చిన్నారి మృతిపైనా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం - శవమై తేలిన చిన్నారి - Seven Years Girl Dead Body Found
అదే విధంగా బాలిక కేసులో అత్యాచారం ఆరోపణలు నిరాధారమని ఎస్పీ మణికంఠ చందోలు సైతం స్పష్టం చేశారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. పుంగనూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు ఆయన పాల్గొన్నారు. బాలికపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. ఆర్ధిక లావాదేవీలతో బాలికను హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. అపహరణకు గురైన రోజే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
బాలిక తండ్రి ఫైనాన్స్ వ్యాపారం చేస్తారని ఎస్పీ వెల్లడించారు. ఇల్లు కట్టుకునే క్రమంలో ఇచ్చిన డబ్బులు త్వరగా ఇవ్వాలని అప్పు తీసుకున్న వారిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అలా అప్పు తీసుకున్న వారిలో ఓ మహిళ బాలిక ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తామని తీసుకెళ్లి హత్య చేసిందని ఎస్పీ వివరించారు. హత్య చేసిన తర్వాత మైనర్ యువకుడితో కలిసి బాలిక మృతదేహాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని ఎస్పీ తెలిపారు. కేసులో నిందితురాలు, ఆమెకు సహకరించిన తల్లి, బంధువైన ఓ మైనర్ ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.