Union Minister Ram Mohan Naidu political Career: పులి కడుపున పులే పుడుతుందనే నానుడిని నిజం చేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది రోజుల్లోనే ఆ యువనేత సిక్కోలు సింహంలా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో గళం వినిపించగా ప్రత్యర్థులూ ఆయన వాగ్థాటికి ముగ్ధులయ్యారు. అనేక సమస్యలపై గొంతెత్తగా నేటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిబద్ధత, అంకితభావం మెండుగా ఉన్న ఆ యువకుడే ఇప్పుడు మోదీ కేబినెట్‌లో చోటు సంపాదించారు. ఆయనే వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న వేళ ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం.
రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్రమంత్రి వర్గంలో చోటు! - Narasapuram MP Srinivas varma
ఘనమైన రాజకీయ ప్రస్థానం విభిన్న భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం. సమస్యలపై చట్టసభలో గళమెత్తి పోరాడే పటిమ. ఇన్ని లక్షణాలున్నాయి కాబట్టే ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మాజీమంత్రి, దివంగత తెలుగుదేశం అగ్రనేత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌కు మంత్రి పదవి దక్కింది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల ప్రావీణ్యంతో పార్లమెంట్ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడంతో రామ్మోహన్ నాయుడికి కేంద్ర క్యాబినెట్ పదవి వరించింది.
రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన రామ్మోహన్ వయసు 36 సంసవత్సరాలు. ఆయనకు భార్య శ్రావ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు.
ఆ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున తొలిసారి పోటీచేసి లక్షా 27 వేల ఓట్లకుపైగా మెజార్టీలో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఓటమిపాలయినా ఆయన మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలుపుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 లక్షల 27వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో తెలుగు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు.