Tungabhadra Dam Works First Phase Successful : తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో ఎలిమెంట్ ఏర్పాటు తొలి దశ విజయవంతమైంది. భారీ ఎలిమెంట్‌ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్‌ను ముందు తొలగించారు. తర్వాత తొలి ఎలిమెంటును 20 మంది కార్మికులు క్రస్ట్‌లో అమర్చారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన స్థానంలో బిగించాల్సిన ఎలిమెంట్లు గురువారం ఉదయమే తుంగభద్ర డ్యాంకు చేరాయి. మధ్యాహ్నమే పనులు ప్రారంభించగా, సెంటర్ వెయిట్ అడ్డం వచ్చింది. కౌంటర్‌లాక్, స్కైవాక్‌లను తొలగించడానికి 90 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.
సుమారు 30 టన్నుల బరువుండే సెంటర్ వెయిట్‌ను విజయవంతంగా కిందకు దించారు. దీంతో గేటు ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తొలి ఎలిమెంటును శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మరో నాలుగు ఎలిమెంట్లను శనివారం మధ్యాహ్నానికి అమర్చి, నీటి వృథాను పూర్తిగా అడ్డుకోనున్నారు. జిందాల్ నుంచి ఇప్పటికే మరో రెండు ఎలిమెంట్లు డ్యాంకు చేరుకున్నాయి. తొలుత ఎలిమెంటును అమర్చటానికి కౌంటర్‌లాక్ గేటు అడ్డుపడింది. దానిని తొలగించిన తర్వాత స్కైవాక్ అడ్డుపడింది. అనంతరం ఎలిమెంటు బిగించే పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేశారు.
మరోవైపు స్టాప్ లాగ్ గేట్ అమరిక ప్రక్రియ విజయవంతం అవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గేటు అమరిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించిందన్నారు. గేట్ అమరిక పరిణామాలను మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన సిబ్బంది, కార్మికులు, అధికారులను చంద్రబాబు అభినందించారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి పని చేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పని మొత్తం పూర్తయ్యే వరకు సమన్వయంతో పనిచేసి సమస్యను అధిగమించాలని రాష్ట్ర అధికారులు, మంత్రులకు చంద్రబాబు సూచించారు.
తుంగభద్ర డ్యాం 19వ నంబర్ గేటుకు సంబంధించి మొదటి గేటును విజయవంతంగా దించగలిగామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం రాత్రి మొదటి గేటును విజయవంతంగా దించగలిగామన్నారు. డ్యాంలో నీరు వృథా కాకుండా తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును పిలిపించింది. ఆయన సిఫార్సు మేరకు భారీ గేటును ఐదు ఎలిమెంట్లుగా తయారు చేసి ప్రవాహం ఉండగానే, అతుకులు పెట్టి అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు.
తుంగభద్ర గేటు కొట్టుకుపోయి ఆరు రోజులు కాగా 33 టీఎంసీల జలాలు వృథాగా నదికి పారాయి. గేటు కొట్టుకుపోయిన రోజు జలాశయంలో 105 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. శుక్రవారం నాటికి జలాశయంలో 72 టీఎంసీలే ఉన్నాయి. మొత్తం 33 గేట్లలో 25 గేట్ల ద్వారా 86,310 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 33,419 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.