Two Farmers From Same Village Died Due to Debts: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు ఒకే రోజు అప్పుల బాధతో మృతిచెందిన బాధాకర ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో మోటపోతులు వెంకటేశ్వర్లు(65) అనే రైతు అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగైదు సంవత్సరాల నుంచి మిర్చి పంట వేస్తున్నాడు. అయితే సరైన దిగుబడి లేకపోవటం, గిట్టుబాట ధర దక్కకపోవటంతో సుమారు 15 లక్షల మేర అప్పులపాలయ్యాడు.
ఇటీవల మళ్లీ పంట సాగుకు సిద్ధమౌతున్న తరుణంలో అప్పుల బాధలు అధికమవటంతో తన ఇంట్లో ముందుగా తెచ్చిపెట్టుకున్న పురుగుమందు తాగాడు. నిద్రపోతున్నాడనుకున్న వెంకటేశ్వర్లు ఎంతసేపటికీ లేవక పోవటంతో వెళ్లి చూడగా మంచంపై విగత జీవిగా పడివున్నాడు. పురుగుమందుల డబ్బా మంచంపై ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేటు వైద్యుని వద్దకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య సుందరమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు.
మిర్చి ధర పతనం కావటంతో మరో రైతు మృతి: గ్రామానికి చెందిన మరోరైతు భూక్యా శ్రీను నాయక్(54) గుండెపోటుకు గురై చనిపోయాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు శ్రీను నాయక్ కౌలుకు పొలం సాగుచేస్తుంటాడు. ఏడు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని అందులో మిర్చి, పొగాకు పంటలు సాగుచేస్తుంటాడు. మిర్చిపంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీను పంట చేతికొచ్చే సమయానికి ధర తగ్గిపోవటంతో గుంటూరు కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచాడు. ఆ తరువాత పంట అమ్మేందుకు వెళ్లగా ధర క్వింటా కేవలం రు.8వేలు మాత్రమే పలకటంతో రు.3లక్షలు మాత్రమే వస్తాయని మనోవేదనకు గురై ఇంటికి వచ్చాడు.
ఆరోజు నుంచి తీవ్ర మనోవేదనపడుతూ, అప్పులు 12 లక్షల ఉన్నాయని దిగులు చెందాడు. భార్య ఓదార్చినా అప్పుల గురించే ఆలోచిస్తున్న శ్రీను నాయక్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బంధువులు ప్రైవేటు వాహనంలో వినుకొండకు తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పుల గురించి, పంటకు గిట్టుబాటు ధర లేక దిగులు చెందాడని, ఆ బాధతోనే గుండెపోటుకు గురై మృతి చెందాడని బంధువులు, కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడు శ్రీను నాయక్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నమ్మించి మోసం చేసిన కుమారుడు- తల్లిదండ్రుల ఆత్మహత్య - Couple Commits Suicide due to Debts
బాపట్ల జిల్లాలో విషాదం- భార్యను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త - HUSBAND KILLED WIFE