TTD Arjitha Seva Tickets for March 2025 : ఆ ఏడు కొండలపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లాది మంది భక్తులు తపిస్తుంటారు. తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని పొందుతారు. అలాగే తిరుమలలో నిర్వహించే ప్రత్యేక సేవల్లో పాల్గొనేందుకు శ్రీవారి భక్తులు ఆసక్తి చూపుతారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ నెల 18న విడుదల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మార్చి 2025కు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలోనే లక్కీ డిప్ కోటా కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. బీ ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచుతారు.
శ్రీవారి దర్శనానికి ఎన్నెన్ని దారులో - సర్వదర్శనం నుంచి స్లాటెడ్ బుకింగ్ వరకు మీకోసం
ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం కోటా, ఉదయం 11 గంటలకు శ్రీ వాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల ఉంటుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు మార్చి 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయలు టికెట్ల కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ ఉంటుంది. బీ ఈ నెల 27న మార్చి నెల శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు. భక్తులు గమనించి https://ttdevasthanams.ap.gov.inలో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
తిరుమల భక్తులకు గుడ్న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?