TTD Precautions to Tirumala Devotees: తిరుమల కొండకు కాలి నడకన వచ్చే భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. ఇటీవల తిరుమలకు కాలి నడకన వచ్చిన భక్తుల్లో కొందరు అస్వస్థతకు గురైన సంఘటనలు వెలుగుచూశాయి. దీంతో తిరుమలకు కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న భక్తులకు టీటీడీ (TTD) పలు సూచనలు చేసింది. భక్తుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు మెట్ల మార్గాన్ని(tirumala walking path) ఎంచుకోకూడదు? అయినా ఒకవేళ రావాల్సి వస్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి వారికి వైద్య సదుపాయాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? అనే విషయాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఈ కింది సూచనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీ వెల్లడించింది.
- 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు.
- ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న భక్తులు తిరుమల కొండకు కాలి నడకన రావడం శ్రేయస్కరం కాదు.
- శ్రీవారి తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా అక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీంతో కొండకు కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. కావున భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారు ప్రతిరోజు వాడే మందులను తమ వెంట తెచ్చుకోవాలి.
- కొండకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద భక్తులు వైద్య సహాయం పొందవచ్చు.
- భక్తుల కోసం తిరుమలలోని ఆశ్వినీ ఆస్పత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం అందుబాటులో ఉంది.
- దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలో ఉన్న స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పిస్తున్నాం. అని టీటీడీ భక్తులకు పలు సూచనలు చేసింది.
"తీరం దాటిన వాయుగుండం" - తిరుపతిలో భారీ వర్షాలు - శ్రీవారి మెట్ల మార్గం క్లోజ్
సంక్రాంతి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? - టికెట్ బుకింగ్ డేట్స్ ఇవే