TTD EO Syamala Rao Warning to Hotel Shopkeepers : తిరుమలలో ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు. తిరుమల ఆస్థాన మండపంలో స్థానిక హోటళ్ల దుకాణదారులతో శ్యామలరావు సమావేశం నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో స్థానిక హోటళ్ల దుకాణదారులకు అవగాహన కల్పించారు. తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల నియమనిబంధనలు మేరకు సలహాలు తీసుకొని అవగాహన తెచ్చుకుని భక్తులకు ఆహారం అందించాలని సూచించారు. తిరుమలలో హోటళ్ల నిర్వాహకులకు ఆహార నియమ నిబంధనలు తెలియవని అన్నారు. ఇప్పటికే తిరుమలలో ఒక హోటల్‌ను మూసివేశామని గుర్తు చేశారు. అవగాహన కల్పించాక నాణ్యమైన ఆహారం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆ రోజు సమయం ఎక్కువ పడుతుంది : భక్తులకు అన్నవితరణ కేంద్రాల్లో టీటీడీ ఆహారం అందిస్తోందని శ్యామలరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం అందిస్తున్నామని అన్నారు. షెడ్లు, క్యూలైన్ వద్ద భక్తులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరీక్షించానని అన్నారు. రద్దీ ఉన్న సమయాల్లోనూ భక్తులకు సమయానికి అధికారులు ఆహారం అందిస్తున్నారని తెలిపారు. వారాంతపు సెలవుల్లో ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.
ఆరోపణలు చేశారు : తిరుమలలో సౌకర్యాలు బాగాలేవని, ఆహారం అందించలేదని సోమవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి భక్తులు ఉద్దేశ పూర్వకంగా చెప్పారని శ్యామలరావు అన్నారు. సమయానికి శ్రీవారి దర్శనం కాలేదన్న కోపంతో భక్తుడు ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల అధికారుల ఆత్మసైర్యం దెబ్బ తింటుందని అన్నారు.
ఆహార నాణ్యతను పరిశీలించిన ఈవో : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తమిళులు అత్యంత పవిత్రమైన పెరటాసి మాసం కావడంతో అనూహ్యంగా తమిళ భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండాయి. భక్తుల రద్దీ పెరగటంతో నారాయణగిరి షెడ్ల వద్ద ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు తనిఖీలు నిర్వహించారు. భక్తులకు సమయానికి ఆహారం, పాలు అందుతున్నాయా లేదా అని షెడ్ల వద్ద భక్తులను అడిగి ఆరా తీశారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆహారాన్ని శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు రుచి, నాణ్యతను పరిశీలించారు.