Tragedy in Victims Families of Achyutapuram Incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటన బాధిత కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెట్టింది. జీవనోపాధి కోసం ఉద్యోగంలో చేరితే తమ వారికి జీవితాలే లేకుండా చేశారని బాధితుల కుటుంబీకులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. లాభాలపైన తప్ప, కార్మికుల భద్రత పట్టని పరిశ్రమల యాజమాన్యం తమ వారి బతుకులను ఛిద్రం చేసిందని వాపోతున్నారు. దుర్ఘటన జరిగి 24 గంటలు దాటినా కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యానికి తమ వారు బలయ్యారని కన్నీటి పర్యంతమవుతున్నారు.
విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలెక్టర్ హరింద్ర ప్రసాద్ ఓదార్చారు. అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్ల ఎంతో మంది బతుకులు తెల్లారిపోతున్నాయని బాధితులు వాపోయారు. అనకాపల్లిలో ప్రమాదం జరిగితే దగ్గర్లో కనీసం బర్న్ వార్డ్ ఉన్న ఆసుపత్రి కూడా లేదని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తే తప్ప గాయపడిన వాళ్లకు చికిత్స అందని పరిస్థితి ఉండటమేంటని ప్రశ్నించారు. యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే తమ వాళ్లు చనిపోయారని వాపోయారు.
తల్లి మనసులో అంతులేని ఆవేదన: రియాక్టర్ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన చల్లపల్లి హారిక మృతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. కాకినాడలోని సౌజన్య నగర్లో నివాసం ఉంటున్న ఈశ్వరరావు అన్నపూర్ణ దంపతుల కుమార్తె హారిక. తాపీ మేస్త్రిగా పనిచేసే తండ్రి ఐదేళ్ల కిందట చనిపోయారు. అన్న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తల్లి, నానమ్మలతో కలిసి ఉంటున్న హారిక కష్టపడి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 11 నెలల క్రితం ఎసెన్షియా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. రాఖీ పండుగకు ఇంటికి వచ్చిన హారిక కాకినాడలో పోటీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని యాజమాన్యం సెలవు నిరాకరించడం వల్ల విధుల్లో చేరి విగత జీవిగా తిరిగొచ్చిందని ఆమె తల్లి కన్నీటి పర్యంతమైంది. రాఖీ పండుగ రోజు తమకు రక్షా బంధనం కట్టిన హారిక ప్రమాదంలో మృతి చెందడాన్ని తట్టుకోలేకపోతున్నామని బంధువులు వాపోయారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం - Ex gratia in Atchutapuram incident