MINISTER KANDULA DURGESH ON TOURISM POLICY: రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందివ్వడం సహా లాభాలను తీసుకువచ్చేలా భవిష్యత్తుపై భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విజయవాడలో పారిశ్రామికవేత్తల సదస్సు ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఎపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు సహా ఇతర దేశాల నుంచి పలువురు ఎన్ఆర్ఐలు సదస్సుకు వచ్చారు. పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చర్యలు ముమ్మరం చేసిందన్న మంత్రి, దీనికోసమే సరికొత్త టూరిజం పాలసీని తీసుకువచ్చినట్లు తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రోత్సాహకాలను ఎండీ ఆమ్రపాలి వివరించారు. రాష్ట్రంలో పర్యాటక శాఖను అభివృద్దికి అపార అవకాశాలున్నాయని ఎపీ ఎండీసీ ఛైర్మన్ నూకసాని బాలాజి తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్న ఛైర్మన్, టూరిజం పాలసీని సీఎం ఆకర్షణీయంగా తయారు చేశారన్నారు.
ఇప్పటి వరకు 6 వేల కోట్లు పెట్టుబడులు: ఇప్పటి వరకు పర్యాటక రంగంలో 6 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చినట్లు తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో పర్యాటక రంగం నిర్విర్యమైందని, ఆ రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు సరికొత్త పాలసీని తీసుకువచ్చామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. పర్యాటక పాలసీ 2024 బ్రోచర్‌ను ఆవిష్కరించి, పర్యాటక పాలసీ గురించి పెట్టుబడిదారులకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
25 వేల కోట్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యం: పర్యాటక రంగంలో 25 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమలకు ఇచ్చే ఇన్సెంటివ్‌లను ఇకపై పర్యాటక రంగంలో పెట్టే ప్రాజెక్టులకూ ఇస్తామన్నారు. కొత్తగా 50 వేల రూములు రావాలని సీఎం ఆదేశించారని, దీన్ని నెరవేర్చడమే లక్ష్యమన్నారు. పాలసీని అమలు చేసి రాష్ట్ర నలుమూలల్లో పర్యాటక రంగం అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తామన్నారు.
సుదూర తీర ప్రాంతం ఉండటం వల్ల పర్యాటకంగా అభివృద్ది చెందేందుకు ఆంధ్రప్రదేశ్‌కి అత్యధిక అవకాశాలున్నాయని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకానికి స్వర్గదామంగా చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతన టూరిజం పాలసీ పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకుంటోందన్న మంత్రి, ఇన్సెంటివ్లపై పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నట్లు తెలిపారు.
పర్యాటక ప్రాజెక్టులు పెట్టేందుకు వచ్చే వారికి గతంలో ఎన్నడూ లేని రీతిలో అన్ని రకాల ప్రోత్సాహకాలిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తరహాలో పారిశ్రామిక వర్గాలపై వేధింపులు, ఆంక్షలు కూటమి ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టి అభివృద్దికి ముందుకు రావాలని మంత్రి కందుల పిలుపునిచ్చారు.
తిరుమలలో ఏపీటీడీసీ హోటళ్లను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ - Kandula Durgesh Inaugurated Hotels