Tirumala Srivari Brahmotsavam 2024 in Tirumala : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు మొదలవుతాయి. వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
అంకురార్పణ క్రతువు : తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన విష్వక్సేనుల వారు శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షణగా రంగనాయకుల మండపానికి వేంచేశారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలో అంకురార్పణ క్రతువు నిర్వహించారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాలు - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు : తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు నేడు మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజ పటం ఎగురవేస్తారు. దీంతో మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో శ్రీవారి వాహన సేవలు మొదలవుతాయి. అక్టోబర్ 11న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రికి అశ్వ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి. 12న శ్రీవారి పుష్కరిణిలో చక్రత్తాళ్వారుకు జరిగే స్నపన తిరుమంజనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
400 ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి : శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ సహా అన్నీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అన్నప్రసాదాలు, భద్రత, పరిశుభ్రతకు ఈసారి పెద్దపీట వేశారు. బ్రహ్మోత్సవాలకు 7 లక్షల లడ్డూలు అదనంగా స్టాక్ అందుబాటులో ఉంచారు. 400 ఆర్టీసీ బస్సులు భక్తులకు అందుబాటులో ఉన్నాయని రోజుకు 2 వేల ట్రిపులు తిరుగుతాయని టీటీడీ ఈవో తెలిపారు.
గట్టి భద్రతా చర్యలు : బ్రహ్మోత్సవాలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టారు. చిన్నపిల్లలు, వృద్దులకు జియో ట్యాగింగ్ తప్పని సరిచేశారు. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో దీపాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. 5 ఏళ్ల తర్వాత శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు తిరువీధుల్లో, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ దేవతామూర్తుల రూపాలు యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి.