Thieves in Vijayawada NTR Block: రాష్ట్ర విభజన అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ భవనంపై భారీ భవంతులను నిర్మించి 20కి పైగా ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం సహా పలు కీలక విభాగాల అధిపతులు ఇక్కడ నుంచే విధులు నిర్వహిస్తుంటారు. ఎన్టీఆర్ ఆడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌గా పిలిచే ఈ భవంతుల్లో రోజూ 5 వేలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు.
కార్యాలయం ప్రాంగణంలోనే వీరి వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఉన్నతాధికారుల కార్లు పార్కింగ్ చేస్తుండటంతో తొలినాళ్లలో గట్టి బందోబస్తు ఉండేది. గడచిన కొన్నేళ్లలో బస్టాండ్‌లో భద్రతా సిబ్బందిని తగ్గించారు. పర్యవేక్షణను గాలికి వదిలేశారు. దీంతో పార్కింగ్ చేసిన ఉద్యోగుల వాహనాలకు భద్రత లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు, దోపిడీ ముఠాలకు నిలయమైంది.
దోపిడి దొంగల బీభత్సం- హైవేపై వాహనాల్లో నిద్రిస్తున్న వారిపై దాడి - ROBBERY ATTACK
ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల ముందుగా పొడవాటి రైల్వే ట్రాక్ ఉంది. ఈ ప్రాంతంలో పటిష్ట భద్రత, ప్రహరీ లేకపోవడంతో చీకటి పడితే చాలు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సహా దోపిడీ ముఠాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. బస్టాండ్ లోపలికి వచ్చి ప్రయాణికుల సెల్ఫోన్లు, లగేజీలను దొంగిలిస్తున్నారు. అడ్డుపడితే దాడులకు తెగబడుతున్నాయి. ఉద్యోగులు బైకులపై కన్నేసిన ముఠాలు వాటిని దొంగిలిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బ్లాక్ ముందు పార్కింగ్ చేసిన ఓ ఉద్యోగి బైక్ ను ఓ దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసుల కళ్లెదుటే రెక్కీ చేసి మరీ అదును చూసుకుని దర్జాగా ఎలా దొంగగతనం చేశాడు.
సుమారు 2 ఎకరాలకు పైగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు లేవు. రోడ్డుకు ఒక వైపు మాత్రమే కెమెరా ఉన్నా అదీ సరిగా పని చేయడం లేదు. దానికి తోడు లైట్లు, భద్రతా సిబ్బంది లేకపోవడంతో దొంగల పని సులభమవుతోంది. బస్టాండ్ ప్రాంగణంలో చోరీలపై నెలకు 30 నుంచి 40 ఫిర్యాదులు వస్తున్నాయంటేనే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. కేవలం ఉద్యోగుల వాహనాలకు మాత్రమే ఇక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించగా పర్యవేక్షణ లేకపోవడంతో బయటి వ్యక్తులూ తమ వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తున్నారు.
దీంతో ఉద్యోగులకు పార్కింగ్ సమస్య ఎదురవుతోంది. ప్రత్యేకంగా స్టిక్కర్లు లేదా గేట్ పాసులు జారీ చేస్తే సమస్య తీరుతుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కీలక దస్త్రాలను కాల్చి వేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోనూ కీలకమైన ఏపీ ఎస్ఎఫ్ఎల్, సీఐడీ కార్యాలయాలు ఉన్నాయి. అందువల్ల సీసీ కెమెరాల ఏర్పాటు సహా ప్రహరి నిర్మించి, భద్రత సిబ్బందిని పెంచితే దొంగతనాలకు చెక్ పడుతుందని, పార్కింగ్ సమస్య తీరుతుందని ఉద్యోగులు కోరుతున్నారు.