Indian Currency Printing Cost : భారత కరెన్సీ నోట్లు ఆరు రకాలు చెలామణీలో ఉన్నాయి. అవి రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10నోట్లుగా విలువ కలిగి ఉన్నాయి. అయితే, వీటి ముద్రణకు రిజర్వ్ బ్యాంకు భారీగానే ఖర్చు చేస్తోంది. అందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?!
కరెన్సీ రాక ముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేది. ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతివే వస్తు మార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అనేవారు. ఆర్థిక కార్యకలాపాలు అతి తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడేది. కరెన్సీ, నాణేలు రాక ముందు ప్రాచీనకాలంలో వస్తువును ద్రవ్యంగా ఉపయోగించేవారు. ఆఫ్రికాలో ఏనుగుల దంతాలు, అమెరికాలో పొగాకు, సముద్రతీర ప్రాంతాల్లో అరుదైన గవ్వలు, భారతదేశంలో గోవులను ద్రవ్యంగా వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
'పది రూపాయల నాణెం చెల్లుతుంది - కాదంటే శిక్ష తప్పదు' - ఆర్బీఐ - Awareness On Ten Rupees Coin
ప్రపంచంలోనే మొదటిసారి చైనాలో కాగితపు ద్రవ్యాన్ని ఉపయోగించారని తెలుస్తోంది. క్రీ.శ. 9వ శతాబ్దంలో ద్రవ్య వినియోగం అమలులోకి రాగా కాగితపు ద్రవ్యాన్ని పెద్ద మొత్తంలో వాడటం క్రీ.శ. 17, 18వ శతాబ్దాల్లో ప్రారంభమైంది. భారత దేశంలో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో మొదలైంది. 1935 ఏప్రిల్ 1న ఏర్పడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1938 నుంచి కరెన్సీ నోట్లను జారీ చేస్తోంది. అయితే అంతకంటే ముందే మన దేశంలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ కాగితం కరెన్సీని మొదటగా జారీ చేసింది.
వాస్తవానికి రూపాయి నాణేలు మొదటిసారిగా 1950లో తయారై తర్వాత క్రమంలో రూపాంతరం చెందాయి. ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, ఇరవై రూపాయల నాణేలు కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, నోయిడాలో ఉత్పత్తి అవుతున్నాయి.
తాజాగా కరెన్సీ నోట్ల ముద్రణపై వ్యయం రూ.5,101 కోట్లకు చేరుకుందని ఆర్బీఐ (RBI) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏ నోటు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందామా!
- రూ.500 నోటు ముద్రణ ఖర్చు రూ.2.94
ఈ నోటుపై దిల్లీలో 17వ శతాబ్దంలో నిర్మించిన ఎర్రకోట చిత్రాన్ని ముద్రించారు.
- రూ.200 నోటు ముద్రణ ఖర్చు రూ.2.93
ఈ నోటుపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 2వ శతాబ్దపు నిర్మాణం సాంచి బౌద్ధ స్థూపం చిత్రాన్ని ముద్రించారు.
- రూ.100 నోటు ముద్రణ ఖర్చు రూ.1.77
ఈ నోటుపై గుజరాత్‌లోని పఠాన్‌లో ఉన్న రాణీకి వావ్ (మెట్ల బావి)చిత్రం ఉంటుంది. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
- రూ.50 నోటు ముద్రణ ఖర్చు రూ.1.13
ఈ నోటుపై కర్ణాటక రాష్ట్రం హంపిలో 15వ శతాబ్దంలో నిర్మించిన రథం చిత్రాన్ని ముద్రించారు.
- రూ.20 నోటు ముద్రణ ఖర్చు రూ.0.95
ఈ నోటుపై ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహల చిత్రాన్ని ముద్రించారు.
- రూ.10 నోటు ముద్రణ ఖర్చు రూ.0.96
ఈ నోటుపై ఒడిశా రాష్ట్రంలోని 13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ సూర్య దేవాలయ రథ చక్రం చిత్రాన్ని ముద్రించారు.
గతంలో 5, 2, 1 నోట్లు కూడా ఉండేవి. కాలక్రమేణ వాటి ప్రింటింగ్‌ను నిలిపివేసి వాటి స్థానంలో కాయిన్స్‌ను తయారు చేస్తున్నారు.
ఆ పది రూపాయలు వద్దంటే మూడేళ్లు జైలుకే!- ఆర్బీఐ తాజా ప్రకటన ఇదే - Indian currency coins
మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఈజీగా మార్చుకోండిలా! - How To Exchange Torn Notes