Konaseema Prabhala Theertham : సంక్రాంతి అంటే సంబురం. సంస్కృతి, సంప్రదాయ ప్రతిబింబం. సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజల పెద్ద పండుగ. భోగి, మకర సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజుల పాటు జరుపుకొనే ఈ పండుగ విశేషాలు అనేకం. దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా సొంతూళ్లకు రావడం, బంధుమిత్రులంతా కలిసి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా లోగిళ్లన్నీ ఆనందోత్సాహాలతో కనువిందు చేస్తుంటాయి. సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు ఒక ఎత్తయితే కనుమ నాడు కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థం మరో ప్రధాన ఘట్టం. ప్రభల తీర్థం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది లేఖ రాయడం గమనార్హం. 2025 సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
చూడముచ్చటైన రూపం.. అందుకు తగ్గట్టుగా అలంకరణ. పూల దండలు, రంగురంగుల నూతన వస్త్రాలు, నెమలిపించాలు.. తాటి, మర్రి కలపతో తయారు చేసే ప్రభలు పచ్చని పొలాల మీదుగా తరలివస్తుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు.
కనుమ రోజున కోనసీమలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రాంతంలో జరిగే ప్రభల తీర్థానికి 4వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందని తెలుస్తోంది. అయినవిల్లి, పి.గన్నవరం, అమలాపురం, అల్లవరంతో పాటు ముమ్మిడివరం, ఐ.పోలవరం, రాజోలు, మామిడికుదురు మండలాల్లో ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆ పుంజు స్పెషల్ - రేటు తెలిస్తే షాక్
మేళ తాళాలతో ఊరేగిస్తూ..
తాటి చెట్టు, మర్రివృక్షంతో చేసిన చక్కబల్ల ఆధారంగా ఈ ప్రభల నిర్మాణం జరుగుతుంది. కర్రలను నూలుతో గట్టిగా కట్టి వాటిపై ఉత్సవ మూర్తుల్ని ప్రతిష్ఠిస్తారు. అలంకరణ కోసం వివిధ రకాల పూలు, నూతన వస్త్రాలు ఉపయోగిస్తారు. దాదాపు 150 నుంచి 200 వందలమంది యువకులు ఈ ప్రభులను మోస్తూ, మేళ తాళాలతో ఊరేగిస్తూ 11 గ్రామాల నుంచి జగ్గన్నతోటకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా దారిలో గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి వరి పొలాల మీదుగా కౌశిక నదిని దాటాల్సి ఉంటుంది.
ఏకాదశ రుద్రులు లోకకళ్యాణార్థం కనుమ రోజు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. చుట్టుపక్కల 11 ఊళ్ల నుంచి ఏకాదశ రుద్రులు (శివ స్వరూపాలు) కనుమ రోజు ప్రభలపై ఒకే చోటికి తరలి వస్తారు. ప్రభల తీర్థం ఉత్సవం జరిగే మొసల్లపల్లి గ్రామంలో ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా వారందరికీ ఆతిథ్యం ఇస్తాడు. భక్తులు హరహర, శరభ, శరభ అంటూ ప్రభలను పైకి ఎత్తుతారు. గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు వచ్చేదారిలో కౌశికీ నదిని దాటే దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది.
గంగలకుర్రు గ్రామానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు ప్రభలతీర్థం విశేషాలను వివరిస్తూ 2020లో ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. దీనిపై మోదీ స్పందిస్తూ ఉత్సవాలు విజయవంతం కావాలని కోరారు. ఏకాదశ రుద్రుల ప్రభల శకటం దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇచ్చింది.
సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు - జనవరి 2 నుంచి బుకింగ్
"తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక" - వీరికి రేషన్ కార్డులు, వారి ఖాతాల్లో డబ్బులు