Online Payments on TGSRTC City Buses : టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు అనుగుణంగా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తుంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఇటీవలే చిరుధాన్యాల స్నాక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా క్యాష్‌లెస్ పేమెంట్స్‌కు అలవాటు పడిపోయారు ప్రజలు. దీంతో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఆన్‌లైన్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తేనుంది ఆర్టీసీ.
ఆగస్టు నెలలోపు సిటీ సర్వీసుల్లో, సెప్టెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆధునిక సాంకేతికతను విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నప్పటికీ, వాటిని ఆర్డీనరీ బస్సుల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. కండక్టర్లకు 10 వేల ఐ-టిమ్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి ద్వారా ప్రయాణికులు టికెట్ డబ్బులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు.
"రైట్, రైట్" మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women
మహిళలకు స్మార్ట్ కార్డ్ : ప్రస్తుతం టీజీఎస్ ఆర్టీసీలో 9 వేలకు పైగా బస్సులు ఉన్నాయి. రోజూ సుమారు 55 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సిటీ, పల్లె బస్సుల్లో ప్రస్తుతం కండక్టర్లు సాధారణ టిమ్‌లు ఉపయోగించి టికెట్లు జారీ చేస్తున్నారు. వీటిల్లో కేవలం నగదుతోనే టికెట్లు జారీ చేయాలి. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఐ-టిమ్స్‌తో డెబిట్ కార్డులు, క్యూ ఆర్ కోడ్ స్కాన్‌తో యూపీఐ చెల్లింపులు జరపొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టాకా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిపోయింది. వీరి ఆధార్ కార్డులు చూసి జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. ఇకపై మహిళలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు చేయనున్నట్లు తెలిసింది. ఇక నుంచి ఆ కార్డుల్ని స్వైప్ చేసి జీరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడున్న టిమ్స్ వల్ల బస్సులు సాయంత్రం డిపోనకు వచ్చిన తర్వాత కానీ ఏ సర్వీసు నుంచి ఎంత ఆదాయం సమకూరిందన్న విషయం తెలీదు. కానీ ఐ టిమ్స్ వల్ల బస్సు కదలికలు, సిబ్బంది పని తీరు, ఆదాయం తదితర విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. దీంతో అధికారులు ఆ బస్సు కండక్టర్‌తో మాట్లాడి కారణం తెలుసుకుని ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ సిటీ బస్సుల్లో ఐ-టిమ్స్ అందుబాటులోకి తెచ్చారు. బండ్లగూడ డిపోలో 74 బస్సులకు 150 టిమ్స్ ఇచ్చారు. ఒక్కో టిమ్‌ను రూ.9,200కు (జీఎస్టీ అదనం) కొనుగోలు చేసినట్లు ఆర్టీసీ వర్గాల విశ్వసనీయ సమాచారం.