Tennis player Rafael Nadal Special Bonding With Andhra Pradesh : టెన్నిస్‌ను ఓ దశాబ్దకాలం పాటు శాసించిన ఆటగాడు రఫెల్ నాదల్. గ్రాండ్ స్లామ్, ఒలింపిక్స్ టెన్నిస్ పోటీల్లో ఎన్నో విజయాలు చవిచూసిన ఈ దిగ్గజానికి అనంతపురంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మట్టి కోర్టుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న నాదల్ తన సంపాదనలో కొంత టెన్నిస్ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారు.
ప్రపంచంలో నాదల్ ఫౌండేషన్ టెన్నిస్ పాఠశాలలు మూడు ఉండగా అందులో ఒకటి అనంతపురంలో ఉండటం విశేషం. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)తో ఉన్న అనుబంధంతో అనంత క్రీడా గ్రామంలో నాదల్ ఎడ్యుకేషనల్, టెన్నిస్ స్కూలును ప్రారంభించారు. దీని నిర్వహణకు ఏటా రూ.55 లక్షలు పంపిస్తున్నారు. ఖరీదైన టెన్నిస్ క్రీడను పేద ప్రతిభావంతులకు చేరువ చేయాలన్న సంకల్పంతో ఆయన ఈ పాఠశాలను స్థాపించారు. స్వదేశం స్పెయిన్‌తో పాటు దుబాయ్, అనంతపురంలో నాదల్ టెన్నిస్ పాఠశాల నిర్వహిస్తున్నారు. 38 ఏళ్ల నాదల్ ఇటీవల టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో అనంతపురం నాదల్ అకాడమీ వివరాలు ప్రస్తావనార్హం.
టెన్నిస్ అంటే ఖరీదైన క్రీడ. టెన్నిస్ రాకెట్ (బ్యాట్) కొనడం పేదలకు సాధ్యమయ్యే పని కాదు. బంతులు, కోర్టు నిర్వహణ ఖర్చులు అదనంగా భరించాలి. అదే నాదల్ అకాడమీలో చేరితే ఒక్క పైసా ఖర్చు లేకుండా టెన్నిస్ పై పట్టు సాధించవచ్చు. ఈ అకాడమీలో ఆటతోపాటు పౌష్టికాహారం, ఆంగ్లంలో శిక్షణ, కంప్యూటర్‌పై అవగాహన కూడా కల్పిస్తారు. నాదల్ అకాడమీ ప్రారంభమైన తర్వాత పేద, మధ్య తరగతి బాలబాలికలు ఎంతో మంది శిక్షణ పొందారు.
ఈ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 2,500 మందిని టెన్నిస్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. నాదల్ అకాడమీలో ఒక సమన్వయకర్త, ఒక కంప్యూటర్ శిక్షకుడు, టెన్నిస్ శిక్షకులు ముగ్గురు, ఇద్దరు వాలంటీర్లు, ఆరుగురు కోర్టుల నిర్వహణకు పనిచేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టెన్నిస్‌లో ఇక్కడ శిక్షణ ఇస్తారు.
టెన్నిస్ నేర్చుకోవాలన్న కుతూహలం, పట్టుదల ఉన్న ఎవరినైనా ఇక్కడ చేర్చుకుంటారు. పేద, ధనిక లాంటి నిబంధనలు ఉండవు. అందరికీ శిక్షణ ఉచితం. నేర్చుకునేందుకు వచ్చిన పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. సాధన తర్వాత రోజు వీరికి ఏదో ఒక ఆహారం ఇస్తారు. రాగి జావ, అరటి పండ్లు, పాలు, గుడ్లు, చిక్కీలు, గుగ్గిళ్లు లాంటి ఆహారం అందజేస్తారు. ఆహారంతోపాటు వీరికి భావవ్యక్తీకరణపై అవగాహన కల్పిస్తారు.
మూడు విభాగాల్లో శిక్షణ : శిక్షణను మూడు విభాగాలుగా విభజించారు. కొత్తగా చేరిన వారికి తొలుత ఎర్రబంతితో శిక్షణ ఇస్తారు. టెన్నిస్ ఆటపై అవగాహన, పాయింట్లు లెక్కించడం, ఆడే ఆధునిక సాంకేతిక విధానాలు, అడ్వాన్స్‌డ్ స్థాయి విధానాలను ఎర్రబంతితో నేర్పిస్తారు. ఆ తర్వాత సరదా గేమ్‌లు కూడా ఆడిస్తారు. ప్రాథమికంగా ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్, సర్వీసులు నేర్పిస్తారు. వేగం, పటుత్వం, గేమ్‌లో పాటించే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఇవన్నీ నారింజ రంగు బంతితో నేర్పిస్తారు. మూడో స్థాయిలో ఆకుపచ్చ రంగు బంతితో స్మాష్, డ్రాప్, స్లైస్, నాబ్ షాట్లు ఆడే విధానంపై పట్టు పెంచుతారు. ఈ విభాగాల్లో రాటుదేలిన క్రీడాకారులను జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. గతంలో నాదల్ అకాడమీలోనే అనేక ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 25 మంది జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.
వెనుకబడిన అనంతపురం జిల్లాలో క్రీడల సంస్కృతిని పెంపొందించడానికి 25 ఏళ్ల క్రితమే ఆర్డీటీ నడుం బిగించింది. సంకల్పానికి అనుగుణంగా ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, ఆయన తనయుడు మాంచోఫెర్రర్‌లు సువిశాల అనంత క్రీడాగ్రామాన్ని ఏర్పాటు చేశారు. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, సాఫ్ట్‌బాల్, జూడో, ఆర్చరీ లాంటి క్రీడలకు ఆర్డీటీ జీవం పోసింది. ఇందులో భాగంగా టెన్నిస్‌ను కూడా పేద పిల్లలకు చేరువ చేయాలని ఆర్డీటీ భావించింది. ఈ విషయాన్ని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ఆయన అంగీకరించారు. అనంత క్రీడాగ్రామంలో నాదల్ టెన్నిస్ పాఠశాలను అక్టోబరు 17, 2010లో ప్రారంభించారు. నాదల్‌తోపాటు ఆమె తల్లి మరియా ఫెరారా కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అప్పటినుంచి నేటివరకు ఈ అకాడమీలో ఎంతో మంది శిక్షణ పొందారు.
'నాదల్ అకాడమీ ద్వారా 2,500 మంది పిల్లలను టెన్నిస్ క్రీడాకారులుగా తీర్చిదిద్దాం. ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ప్రాతినిథ్యం వహించారు. పేద పిల్లలు కూడా టెన్నిస్ ఆటకు చేరువయ్యారు.' - విశాల్ విజయ్‌కుమార్, అకాడమీ సమన్వయకర్త