Tenali Young Woman Dies in America : ఉన్నత చదువులు, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన తెనాలి యువతీ, యువకుల మృత్యువాత వార్తలు తెనాలి వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మూడు నెలల క్రితం ఇరువురు తెనాలికి చెందిన యువతి, యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత గురికాగా శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన మరో యువతి మృత్యు ఒడిలోకి వెళ్లింది. మృతి చెందిన యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి చెందారు. ఈ మధ్యకాలంలో తెనాలి ప్రాంతం నుంచి చదువుకోటానికి అమెరికాకు వెళ్లిన మరో ఇద్దరిలో ఒకరు యాక్సిడెంట్లో మరొకరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ మృతి చెందారు. ఈ ఘటనలు మరవకముందే మరొక అమ్మాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబరులో అమెరికా వెళ్లారు. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టడంతో గాయాలపాలై మృతి చెందారని, అక్కడి అధికారులు తమకు సమాచారం అందించారని తల్లిదండ్రులు తెలిపారు. మంత్రి మనోహర్, ఎంపీ పెమ్మసాని తమతో మాట్లాడారని అక్కడ వారితో మాట్లాడి వీలైనంత తొందరగా మృతదేహాన్ని తీసుకువస్తామని తెలిపారని చెప్పారు. తమ కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని తండ్రి గణేశ్ వెల్లడించారు.
జూలైలో మరో యువతి..
తెనాలికి చెందిన యువతి జెట్టి హారిక(25) జూలై నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఎంఎస్ చేయడానికి 2023 ఆగస్టులో అమెరికా వెళ్లిన జెట్టి హారిక హోమా స్టేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. హారిక చనిపోయినట్లు ఆమెరికా నుంచి ఫోన్ వచ్చిందని దేవాదాయ శాఖలో పనిచేసే హారిక తండ్రి జెట్టి శ్రీనివాసరావుకి అప్పట్లో ఫోన్ ద్వారా సమాచారం అందింది. తమ కూతురు ఉన్నత చదువుల కోసం బ్యాంకు లోన్ తీసుకుని అమెరికా పంపించామని తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.
అమెరికాలో దుండగుడి కాల్పులు - బాపట్ల యువకుడి మృతి - AP Youth Killed Firing in America
అమెరికాలో "అంతిమ ప్రయాణం" - చెదిరిన కలలు - చెమ్మగిల్లిన కళ్లు