High Court Rejects Mohan Babu Anticipatory Bail Petition : నటుడు మోహన్‌బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరిపై దాడి ఘటనలో మోహన్‌బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. జల్పల్లిలోని తన ఇంటి వద్ద జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్‌బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరఫు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుతం మోహన్‌బాబు తిరుపతిలో ఉన్నారని, గుండె, నరాల సంబంధిత సమస్యలుతో బాధపడుతున్నారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించారు. మరోవైపు మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
వాదనలు జరిగాయిలా: మోహన్‌బాబు ఫాంహౌస్‌లో ఈనెల 10న చోటు చేసుకున్న ఘటనలో కేసు నమోదైంది. న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడి చేశారు. దీంతో ఆ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దీనిపై పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దాని ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, అరెస్టు తదుపరి దర్యాప్తు చేయకుండా పోలీసులను ఆదేశించాలని మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సోమవారం హైకోర్టులో జస్టిస్ కె.లక్ష్మణ్ ఈ పిటిషన్‌లపై విచారణ జరిపారు. దీనికి సంబంధించి మోహన్‌బాబు తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
ఇది అనుకోకుండా జరిగిన ఘటన: మోహన్‌బాబుకు గాయపడిన విలేకరితో కనీసం పరిచయం కూడా లేదని, అతనెవరో కూడా తెలిదయని తెలిపారు. అలాంటప్పుడు అతడిపై హత్యాయత్నం ఎలా చేస్తారని, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సరైనవి కావని వాదనలు వినిపించారు. మోహన్‌బాబు కుటుంబ సమస్యలు, గొడవలను మీడియా ఛానళ్లు, సోషల్‌మీడియా పెద్దవిగా చేసి చూపించాయని వివరించారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని కోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ, ఈ ఘటనపై మొదట పోలీసులు కేసు నమోదు చేసి, అనంతరం బాధితుడి వాంగ్మూలం ప్రకారం సెక్షన్లు జోడించినట్లు తెలిపారు. ఈ కేసులో మోహన్‌బాబు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మోహన్‌బాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు.
అంతా చట్ట ప్రకారమే: విచారణకు హాజరైన రోజే ట్రయల్ కోర్టులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కింది కోర్టును ఆదేశించాలని ఈ సందర్భంగా మోహన్‌బాబు తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. మోహన్‌బాబు అరెస్టు విషయంలో అంతా చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని ఇప్పటికే రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. హైకోర్టు తీర్పుతో పహడీషరీఫ్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదు - మోహన్‌బాబు భార్య సంచలన లేఖ