Telangana High Court Refuses to Cancel Avinash Reddy Anticipatory Bail : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP YS Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డికి హైకోర్టు గతేడాది మే 31న షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే అవినాష్ రెడ్డి షరతులను ఉల్లంఘించి సాక్షులను ప్రలోభపెడుతున్నారని, బెదిరిస్తున్నారని దస్తగిరి వాదించారు.
జైళ్లో తనను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని తన తండ్రిపై దాడి చేశారన్నారు. సీబీఐ, సునీత కూడా దస్తగిరి వాదనలను సమర్థించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తేనే సాక్షులకు రక్షణ ఉంటుందని సీబీఐ వాదించింది. వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది.
సునీల్ యాదవ్, ఉమాశంకర్‌కు బెయిల్ నిరాకరణ: సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వారిద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇటీవల జరిగిన విచారణలో పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. వివేకా హత్యలో (Accused in YS Viveka murder case) సునీల్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. హత్య జరిగిన సమయంలో వివేకా ఇంట్లో ఆయన ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా తేలిందని సీబీఐ పేర్కొంది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, హత్య సంఘటనలో ఆయన పాల్గొన్నారనడానికి అదొక్కటే ఆధారం కాదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వివేకా ఇంటి వద్ద వాచ్‌మెన్ రంగన్న, అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం సునీల్ యాదవ్ పాత్ర ఉందని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. వివేకా హత్య జరిగిన తరువాత పారిపోతుండగా గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్‌లను గుర్తించినట్లు రంగన్న వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ తెలిపింది. దీనికితోడు సీసీ టీవీ ఫుటేజీ, హత్యకు ముందు, తరువాత నిందితుల మధ్య ఫోన్ కాల్ డేటా రికార్డు ఉన్నాయని హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది.