Telangana Government Rejects Adani Donation: అదానీ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా వస్తున్న విమర్శల దృష్ట్యా స్కిల్ వర్శిటీకి అదానీ విరాళాన్నితిరస్కరిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని, అదే విషయంపై అదానీకి లేఖ పంపించినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్నిలాగవద్దని రేవంత్ రెడ్డి కోరారు. రూ.100 కోట్లు స్కిల్ వర్శిటీకి బదిలీ చేయవద్దని అదానీకి లేఖ రాశామన్నారు. కాగా ఇటీవల తెలంగాణలోని స్కిల్ వర్శిటీకి రూ.100 కోట్ల విరాళాన్ని అదానీ సంస్థ ప్రకటించింది. అయితే అదానీ సంస్థపై లంచాల విమర్శల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అదానీ విషయంలో కొన్నిరోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని, అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించిందని అడుగుతున్నారని రేవంత్ అన్నారు. అయితే అదానీ నుంచి సేకరించిన పెట్టుబడులు రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే జరిగాయని తెలిపారు. నిబంధనల మేరకే టెండర్లను పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ సంస్థకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అంబానీ, అదానీ, టాటాలు ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కుందని స్పష్టం చేశారు. సీఎస్‌ఆర్ (Corporate Social Responsibility) ఫండ్స్ కింద స్కిల్ వర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం ప్రకటించిందని అన్నారు. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని, విరాళానికి కేంద్రం నుంచి పన్ను మినహాయింపు కోసం చూస్తున్నామని అన్నారు. అదానీ ప్రకటించిన విరాళం ఇంకా తెలంగాణ ప్రభుత్వ ఖాతాలోకి రాలేదని తెలిపారు. దీంతో ఆ రూ.100 కోట్లు విరాళాన్ని బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూప్‌నకు లేఖ పంపినట్లు రేవంత్ వెల్లడించారు.
అవసరమైతే ఎన్నిసార్లైనా దిల్లీ వెళ్తా: మరోవైపు తన దిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలపై మంగళవారం ఎంపీలతో చర్చిస్తామని, అందుబాటులో ఉన్న మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరిస్తామన్నారు. 28 సార్లు దిల్లీ వెళ్లానని విమర్శిస్తున్నారని, మీలా పైరవీలు చేయడానికి బెయిల్ కోసం దిల్లీ వెళ్లలేదని మండిపడ్డారు. కేంద్రాన్ని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవాలని, రాష్టాభివృద్ధి కోసం అవసరమైతే ఎన్నిసార్లైనా దిల్లీ వెళ్తామని అన్నారు.
అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టు - పార్లమెంటు ఉభయసభలు బుధవారానికి వాయిదా
సెకితో సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందం - అధిక ధర ఎందుకంటే - అడ్డగోలు వాదన