TDP leaders Fire on YSRCP Government : ఐదేళ్లుగా అడ్డగోలుగా తెచ్చిన అప్పులు చాలవన్నట్లు జగన్ ప్రభుత్వం మరో దారుణానికి ఒడిగట్టింది. ఒకప్పుడు అమరావతిని స్మశానం, ఎడారి అని విమర్శించిన పెద్ద మనిషి ఇప్పుడు అదే ఎడారిలో నిర్మించిన సచివాలయాన్ని రూ.370 కోట్ల అప్పు కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టేశారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని దుయ్యబట్టారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టడం చాలా అవమానకరం, బాధాకరమన్నారు. సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని జగన్ నాశనం చేశాడని విమర్శించారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని ఎక్స్ (X) వేదికగా ప్రజలకు చంద్రబాబు విజ్ఙప్తి చేశారు.
అమరావతి భ్రమరావతి అనే జగన్- సచివాలయాన్ని ఎలా తాకట్టు పెట్టారు- రాజధాని రైతుల ఆగ్రహం
AP Secretariat Mortgage : గత ఐదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టుపెట్టారన్న వార్త చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తే ఒంటికాలిపై లేచిన వైకాపా మేధావులు దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని సచివాలయాన్ని370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక ఆ దేశంతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అన్నారు. ఇంతకంటే దిగజారలేరు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ రాష్ట్ర పరువును మంటగలుపుతున్న ముఖ్యమంత్రి జగన్ని ఏమనాలో ఎవరితో పోల్చాలో కూడా మాటలు రావడం లేదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమీ చేసినా గెలవడు - ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర భవిష్యత్ కోసం రైతులు ఇచ్చిన భూముల్లో తెలుగుదేశం ప్రభుత్వం సచివాలయం నిర్మిస్తే దానిని అమ్మే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. సచివాలయాన్ని రహస్యంగా తాకట్టు పెట్టడం కిరాతక చర్యని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సర్కార్ ప్రభుత్వ సంస్థల ఆస్తులను తాకట్టుపెట్టి వేల కోట్లు అప్పులు చేస్తోందని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సీఎం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్