TDP Devineni Uma on Pension Distribution: గతంలో జరిగిన తప్పు మళ్లీ జరగకుండా మే 1నే పింఛన్ దారులకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఈ నెలలో సెర్ఫ్ సీఈఓ, చీఫ్ సెక్రటరీ నిర్ణయాలతో పింఛన్ దారులు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటల్లోనే 60 మంది చనిపోయినట్లు సాక్షిలో వార్తలు వచ్చాయని, వారి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
మార్చి చివరి వారంలో వైసీపీ ప్రభుత్వం అస్మదీయ కాంట్రాక్టర్లకు 14 వేల కోట్లు చెల్లించారని, ఏప్రీల్‌లో పింఛన్ల పంపిణీకి డబ్బులు లేకుండా చేసి 60 మంది వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. మార్చిలోనే చెప్పినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి సిబ్బంది ఉన్నా శవరాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీపై వెంటనే చీఫ్ సెక్రటరీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటింటికి పింఛన్ ఇచ్చేలా ప్రధాన ఎన్నికల అధికారిని కోరతామన్నారు. పింఛన్‌ను 200 నుంచి 2000 లకు పెంచి ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని స్పష్టం చేశారు. పెంచిన పింఛన్ ఇవ్వడానికి జగన్‌కు 58 నెలలు పట్టిందని దుయ్యబట్టారు. 7 లక్షల కోట్ల బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం హయాంలో దాదాపు 20 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వగా, 12 లక్షల కోట్ల బడ్జెట్లో వైసీపీ ప్రభుత్వం ఎన్ని లక్షల కొత్త పింఛన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పింఛన్ల పంపిణీని కావాలనే ఆలస్యం చేశారు - సీఈవోకు సీఎఫ్‌డీ ఫిర్యాదు - CFD Complaint on Pensions Delay
కాగా ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అధికార వైసీపీ తీరు కారణంగా పలువురు పెన్షనర్లు చనిపోయారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలక్షన్ కమిషన్‌కి లేఖ సైతం రాశారు. అదే విధంగా కూటమి నేతలు సైతం ఈ విషయాన్ని కేంద్ర మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీ సీఎస్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో తెలిపారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ దీనిపై స్పందించారు. మే నెలలో అయినా పింఛన్ 1వ తేదీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ నుంచే 4 వేల రూపాయల పింఛన్ - అదీ ఇంటి వద్దే : అచ్చెన్నాయుడు - TDP Atchannaidu on Pensions