TDLP key Meeting on June 11: ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఎన్నుకుని గవర్నర్ కు నివేదిక పంపుతామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12న ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారంతోపాటు ఒడిశా ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు వెళ్తారని తెలిపారు. దొంగే దొంగా దొంగా అని ఏడ్చే విధానాలు ఓటమి చూశాక కూడా జగన్ మారలేదని విమర్శించారు. అసహనంతో తెలుగుదేశం శ్రేణులపై దాడుల్ని ప్రేరేపిస్తూ తామేదో దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాడని గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు.
జూన్ 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో 12వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత, మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరుకావాలని నిర్ణయించారు. ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అందులో భాగంగా ఈ నెల 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్డీఏ కూటమి అధికారం రావడంలో చంద్రబాబు కీలక పాత్ర : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్