TDP Worker Murder in Tirupati District : తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో టీడీపీ కార్యకర్త హత్యని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. వైఎస్సార్సీపీ నాయకులు ఓ దళితుడిని అన్యాయంగా హతమార్చారని ధ్వజమెత్తింది. ఆ పార్టీ నేతల రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను కోరింది. చిల్లకూరు మండలం ముత్యాలపాడుకు చెందిన నారపరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, వంశీ దాయాదులు. వారి కుటుంబాల్లో నెలకొన్న పాత గొడవల కారణంగా సోమవారం సాయంత్రం మహిళల మధ్య వివాదం తలెత్తింది.
ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత నారపరెడ్డి శ్రీధర్‌రెడ్డి సర్దుబాటుకు యత్నించినా వైఎస్సార్సీపీ నేత వెంకట కృష్ణారెడ్డి గొడవకు దిగారు. ఈ నేపథ్యంలోనే తమపై దాడి చేశారంటూ వెంకట కృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కట్టా రామిరెడ్డి, దిలీప్‌కుమార్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. వారు నాంచారంపేట ఎస్సీ కాలనీకి చెందిన కొందరిని పోగేసి మారణాయుధాలతో శ్రీధర్‌రెడ్డి, గెద్దెల చిరంజీవి, నాగసాల సురేంద్రలపై దాడి చేశారు.
TDP Leader Hariprasad Murder : ఈ నేపథ్యంలో నాగసాల సురేంద్ర స్నేహితుడు కాటయ్య, స్థానికుల సాయంతో వారిని అడ్డుకున్నారు. గాయపడ్డ శ్రీధర్‌రెడ్డి, చిరంజీవి, సురేంద్రలను గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డి, చిరంజీవి అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నాగసాల సురేంద్ర, కాటయ్య వాలంటీర్లు. ఎన్నికలకు ముందు రాజీనామా చేసి టీడీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు వారిపై కక్ష పెంచుకున్నారు.
నిందితుల పరారీ : కాటయ్యను హతమార్చేందుకు వైఎస్సార్సీపీ నాయకులు యత్నిస్తున్నారని అతని చిన్నాన్న కుమారుడు మల్లారపు హరిప్రసాద్ ఆయన ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ కార్యకర్తలు దుంపల మధు, భాను, సాయి, డేనియల్, మన్నెం హర్ష, మోజెస్ మరికొందరితో కలిసి మంగళవారం తెల్లవారుజామున కాటయ్య ఇంటి కిటికీ పగలగొట్టి పెట్రోలు చల్లి నిప్పు అంటించారు. పొగకు తట్టుకోలేక బయటకు వచ్చిన ఇద్దరిపై 15 మంది దాడి చేశారు. ఇందులో కాటయ్య తప్పించుకోగా హరిప్రసాద్ మృతి చెందారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
హరిప్రసాద్ హత్యను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఖండించారు. వైఎస్సార్సీపీ నేత రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ రౌడీ మూకలు దాడులకు తెగబడుతున్నాయని ధ్వజమెత్తారు. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పోలీసులను కోరారు.
సత్యసాయి జిల్లాలో దారుణం- వేట కొడవళ్లతో టీడీపీ కార్యకర్త హత్య - TDP Worker Murder Case