Gangamma Jatara Viswa Roopa Darshanam in Tirupathi District : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టం పూర్తయ్యింది. ఆలయ అధికారులు తొలుత గంగమ్మ ఆలయంలో స్తంభానికి అర్చకులు విశ్వరూప ధారణ చేశారు. భక్తులను కటాక్షించే అమ్మావారి వీక్షణ కోసం భక్తులు తెల్లవారు జామునుంచే ఆలయానికి తరలివచ్చారు. నగరంలో ఇంటింటికీ తిరుగుతూ నీరాజానాలందుకుంటున్న గంగమ్మ పేరంటాల వేషధారణలో ఆలయానికి చేరుకున్న అమ్మవారికి హారతి ఇవ్వటంతో జాతర ముగిసింది.
మమ్మేలు మాయమ్మ గంగమ్మ అందరినీ కరుణించు దయగల తల్లీ అంటూ భక్తులు మోకరిల్లారు. కల్పవల్లి, భక్తుల పాలిట కొంగుబంగారం, తిరుమల శ్రీవారి సోదరి, మహిమాన్విత శక్తి కలిగిన గ్రామదేవతగా పిలిస్తే పలికే దైవంగా కోరిన కోర్కెలు తీర్చే దేవతగా విరాజిల్లుతున్న తిరుపతి గంగ జాతర అంగరంగ వైభ వంగా జరిగింది. తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ముఖ్య ఘట్టంగా భావించే సప్పరంలో భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్దఎత్తున పొంగళ్లు పెట్టారు.
మంగళవారం తెల్లవారుజామునే గంగమ్మ మూలవిరాట్‌కు పసుపు, కుంకుమ, చందనం, పాలు, పెరుగు, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తర్వాత పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి నూతన పట్టువస్త్రాలు అలంకరించారు. బంగారు ముఖబింబంతో అమ్మవారు కాంతులీనారు. వజ్రాల కిరీటంతో చూడముచ్చటగా కనిపించారు. గంగమ్మను కలెక్టర్ ప్రవీణ్ కుమార్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. జాతరను పురస్కరించుకొని గంగమ్మ గుడి ఆలయ ఆవరణం, పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి.
కడప అమీన్ పీర్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు - సీఎం జగన్ హాజరయ్యే అవకాశం
మంగళవారం అర్ధరాత్రి వరకు భక్తులు గుడి ఆవరణలోనే జాగారం చేశారు. బుధవారం తెల్లవారుజామున గంగమ్మ మట్టి విగ్రహానికి చెంప నరికే కార్యక్రమం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు. బంకమట్టి, గడ్డితో తయారుచేసిన ఈ విశ్వరూప మృతికను ఇంటికి తీసుకెళ్తే మంచి జరుగుతుందనే నమ్మకం అనాదిగా వస్తుండటంతో మృతిక తీసుకోవటం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.