HIGH TENSION IN TADIPATRI : అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. పోలింగ్ రోజునే తనలోనే నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. టీడీపీ ఏజెంట్లపై దాడులకు తెగబడి భయాందోళన సృష్టించాడు. అంతటితో ఊరుకోక మంగళవారం సైతం తాడిపత్రిలో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా అందర్నీ భయకంపితులను చేశాడు. పట్టణంలో తన వాహన శ్రేణితో వేగంగా తిరుగుతూ అరాచకత్వానికి నిలువుటద్దంగా నిలిచాడు. ఇదంతా చూస్తున్న జనం భయంతో వణికిపోవడం కనిపించింది. ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకొని రోజంతా గడాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలీసులు సైతం ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఏఎస్పీ లాంటి అధికారినే దుర్భాషలాడిన పెద్దారెడ్డిని అదుపు చేసేవారే లేరా? అన్న ప్రశ్న పట్టణవాసుల్లో మెదిలింది.
తాడిపత్రిలో పోలింగ్ రోజు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి వాహనంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆ దాడుల్ని ప్రతిఘటించిన టీడీపీ నాయకుడు సుర్యముని ఇంటికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. కులం పేరుతో దూషించారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణకు గాయమైంది.
దాడి గురించి తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో సూర్యముని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం అనుచరులతో కలిసి సూర్యముని ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కి ర్యాలీగా వెళ్లారు. స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన కొనసాగుతుండగానే తెలుగుదేశం శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపునకు దూసుకెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల మధ్య ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో ఇరువర్గాలూ పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పెద్దారెడ్డి ఇంటిపైకి ఎక్కిన వైఎస్సార్సీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. ఒకరిపై ఒకరు బాణసంచా పేల్చుకున్నారు. చివరకు కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు.
ఏపీ ఊపిరి పీల్చుకో - పల్నాడులో తీరం దాటిన రాజకీయ తుపాను ! - AP Elections 2024
గత రాత్రి పెద్దారెడ్డి సోదరుడి కుమారుడు, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో తాడిపత్రికి రాగా ఎస్పీ సూచన మేరకు తిరిగి వెళ్లిపోయారు. తాడిపత్రిలో ఘర్షణలకు కారణమైన ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు.
టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి - దివ్యాంగుడి పరిస్థితి విషమం : ఈ ఘటనలతో తాడిపత్రిలో పోలీసుల భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి డీఎస్పీలను రప్పించి భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. జేసీ కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్‌ను పోలీసులు చితకబాదారు. దివ్యాంగుడు కిరణ్ ఇంటికి తెల్లవారుజామున వెళ్లి స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని వైద్యుల సిఫార్సు చేశారు.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu