Suspension on Tickets in NTR District : ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు తెలుగుదేశంలోకి వైఎస్సార్సీపీ నేతల చేరికను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేస్తుండగా, మరోవైపు జనసేన అభ్యర్థికి టికెట్ కేటాయించే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పోటా పోటీగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
టికెట్ అంశాన్ని పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారు: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఉచ్చులో జనసేన శ్రేణులు పడవద్దని సూచించారు. జనసేనకు ఉన్న కార్యకర్తల బలంతో 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్ధానాలకు పోటీ చేస్తున్న అంశాన్ని జనసైనికులు గుర్తించాలని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం పని చేస్తుందని తెలిపారు. అందుకోసం ప్రభుత్వ సొమ్ముతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందని ఆరోపించారు.
పొత్తులో భాగంగా జనసేన మూడు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలు శాశ్వత ప్రతిపాదికగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే పవన్ అంటే వైఎస్సార్సీపీ నాయకులకు భయమని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసమే పని చేయాలని, సీటు ఎప్పుడు వస్తుందనేది ఆలోచించకూడదని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం సీటు విషయంలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని పోతిన మహేష్ తెలిపారు.
ప్రతిపక్షాల సీట్లు, పొత్తుల గురించి అధికార పార్టీకి ఎందుకు? : గాదె వెంకటేశ్వరరావు
వాట్సప్‌లో వచ్చే ప్రచారాలు నమ్మవద్దు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో చేరుతున్నారనే వార్తలను టీడీపీ శ్రేణులు ఖండించారు. ఆదివారం చండగూడెంలో గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త లక్కింశెట్టి పుల్లారావు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. ఇక్కడపలువురు నాయకులు కార్యకర్తలు వసంత కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఫేకు ప్రచారాలు, వాట్సాప్ గ్రూపులో వచ్చే వాటిని నమ్మొద్దని కార్యకర్తలు, నాయకులకు దేవినేని సూచించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విషయాలు అధిష్టానానికి వివరించానని ఉమా తెలిపారు.
టీడీపీలో చేరుతా: ఇదిలావుంటే చంద్రబాబు సమక్షంలో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ కలిసి చంద్రబాబు వద్దకెళ్తానని స్పష్టం చేశారు. దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని వసంత కృష్ణప్రసాద్ చెప్పారు. అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో అన్నీ మాట్లాడుకుంటామన్నారు. వైఎస్సార్సీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారని వసంత ఆరోపించారు.
ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది: శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్