Success Story Transgender Anand Babu Transforms into Hanna Rathod : ట్రాన్స్‌జెండర్లు అంటేనే ఒకరకమైన చిన్నచూపు. అందుకు జన్యుపరమైన లోపమే కారణమని అర్థం చేసుకునేందుకు ఎవరూ ప్రయత్నించరు. కన్నవారే బయటికి గెంటేస్తుంటారు. అలాంటి పరిస్థితి తనకూ వస్తుందేమోనని భయపడి, ఉన్నతస్థాయికి చేరాకే ట్రాన్స్‌ఫ్యూజన్ చేయించుకున్నట్లు బయటపెట్టింది హన్నారాథోడ్. స్పెయిన్‌లో శాస్త్రవేత్తగా పని చేస్తూనే గతేడాది మిస్ వరల్డ్ ట్రాన్స్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచి తోటి ట్రాన్స్‌జెండర్లలో స్ఫూర్తి నింపుతోంది.
అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలో ఆనంద్‌బాబుగా పుట్టిన హన్నారాథోడ్ మల్లేష్, పద్మావతి మూడో సంతానం. తల్లిదండ్రులు పండ్ల వ్యాపారం చేసేవారు. రోజులో ఒక్క పూటైనా కడుపు నిండుతుందనే ఆశే తనను బడి బాట పట్టించింది. చదువుపై ఇష్టం పెంచింది. క్లాస్‌లో టాపర్‌గా నిలిపింది. అయితే 6 ఏళ్ల వయసులోనే తన లోపం తెలియడం ప్రారంభమైంది.
అమ్మాయిలా ఉండాలనే కోరిక గురించి తెలిస్తే చదువుకు ఆటంకం కలుగుతుందేమోనని భయం హన్నాను వెంటాడేది. అమ్మానాన్న మనసు కష్టపెట్టవద్దని మనోవేదన అనుభవిస్తూనే చదువుల్లో మాత్రం ఎక్కడా వెనకబడలేదు. దాతల సహాయంతో బీఫార్మసీ కూడా పూర్తయిపోయింది. కాలేజీలో ఉన్నప్పటి నుంచే విదేశాల్లో ఎంఎస్ చేయాలని హన్నా కలగా ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించక అనంతపురంలోని ఓ పాఠశాలలో టీచర్‌గా 2ఏళ్లు పనిచేయాల్సొచ్చింది. జూనియర్ ఫార్మా విద్యార్థులకు ట్యూషన్లు చెప్పగా వచ్చిన కొద్దిపాటి ఫీజులు తన పొదుపునూ పెంచాయి. అంతలోనే అనంతపురం కలెక్టరేట్ ఆఫీసులో ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి మొదలైంది.
వివాహం చేసుకుని మరో అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని హన్నా ఆలోచన. అలా విదేశాల్లో ఎంఎస్ అవకాశం కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అర్హత పోటీల్లో వేలమందిని వెనక్కి నెట్టి స్పెయిన్‌లో MS సీటు కూడా దక్కింది. తర్వాత బయో ఇంజనీరింగ్ సొల్యూషన్స్‌లో సైంటిస్ట్‌గా అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడే వరకూ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు హన్నా. పళ్ల వ్యాపారి కుమారుడి నుంచి హన్నారాథోడ్‌గా ఎలా మారిందో వివరిస్తోంది.
"నా ఫీలింగ్స్ అన్నీ అమ్మాయిలాగా ఉండటం నాకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే గుర్తించాను. దీని గురించి చెప్తే సమాజం నన్ను ముందుకు వెళ్లనివ్వదు అని తెలిసింది. నా జీవితం ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో అన్నీ నా మనసులోనే దాచుకున్నాను. అమ్మా నాన్నలకు చెడ్డపేరు రాకూడదు అనుకున్నాను. ఆ విధంగానే నేను చదువుకుని, జాబ్ తెచ్చుకున్నాను. అనంతరం నా సొంత డబ్బులతో సర్జరీ చేపించుకున్నాను". - హన్నా రాథోడ్, మిస్ వరల్డ్ ట్రాన్స్ పోటీల రన్నరప్
గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్ పోటీలు జరిగాయి. అక్కడే పని చేస్తోన్న హన్నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరపున పోటీపడి రన్నరప్‌గా నిలిచింది. భారతీయ ట్రాన్స్‌జెండర్లలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ఈ పోటీల్లో పాల్గొన్నానని..తొలిసారే ప్రపంచస్థాయి పోటీల్లో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని చెప్తోంది.
మన దేశంలో విద్యావంతులైన తల్లిదండ్రులే తమ బిడ్డ ట్రాన్స్‌జెండర్ అని తెలియగానే వెలివేస్తుంటారు. నిరక్షరాస్యులైనా..పెద్ద మనసుతో అక్కున చేర్చుకున్నారు హన్నా రాథోడ్ తల్లిదండ్రులు. మానసికంగా ఎన్ని బాధలున్నా ఉన్నతస్థాయికి ఎదిగిన హన్నా రాథోడ్‌ని చూస్తే గర్వంగా ఉందంటున్నారు స్నేహితులు, బంధువులు.
ట్రాన్స్‌జెండర్లు ఈ పనులే చేస్తుంటారనే ముద్రను చెరిపేస్తూ శాస్త్రవేత్తగానూ ఎదగగలరని నిరూపించింది హన్నా రాథోడ్. ఈ స్థాయికి చేరడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ 3 భాషల్లో పుస్తకం రచిస్తోంది. ఈ ఏడాది దిల్లీలో జరిగే మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.
పేదలకు అండగా ట్రాన్స్‌జెండర్- ఏడాదికి 10మంది యువతులకు పెళ్లిళ్లు- గత 12 ఏళ్లుగా ఇలానే!