Students Making Fruit Peels as Fertilizers: విజయవాడ శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వ్యర్థంతో అర్థం అనే నినాదాన్ని ఉపయోగించి అద్భుతాన్ని సాధించారు. పండ్ల తొక్కలతో పోషకవిలువలున్న ఎరువును తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు.
భువనేశ్వరి, శరత్ చంద్రిక అనే విద్యార్థినులు విజయవాడ ప్రభుత్వ ఉన్నత ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వినూత్నంగా ఏదైనా చేయాలని ఆలోచనకు పదునుపెట్టారు. పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి సూచనలతో నేలను సారవంతం చేసేందుకు ఎరువును తయారు చేశారు. ప్రయోగాత్మకంగా మొక్కలను పెంచి తమ ప్రతిభను చాటారు.
పండ్ల వ్యర్థాలను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టి పౌడర్‌గా తయారు చేశారు ఈ విద్యార్థులు. ఆ పౌడర్‌ను ల్యాబ్‌లో పరీక్షలు చేయించి ఏ రకమైన పండ్ల వ్యర్థాల పౌడర్‌లో ఏ తరహా పోషక విలువలున్నాయో తెలుసుకున్నారు. ఆమ్ల, క్షార విలువలు తెలుసుకుని మొక్కలకు తగినట్లు వాటిని వినియోగించారు. వర్మి కంపోస్ట్ కంటే అధికంగా నత్రజని, పొటాషియం లాంటి మూలకాలు ఉండటం గమనించామని విద్యార్థినులు చెబుతున్నారు.
వ్యర్థాలను అర్థవంతంగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు ఈ విద్యార్థులు. గతేడాది రాష్ట్ర స్థాయిలో జరిగిన బాలల సైన్స్ కాంగ్రెస్, దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. మొదట కొందరు ఫ్రూట్ జ్యూస్ సెంటర్ యజమానులు, కాయలు విక్రయించే వారు వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారని అయినా వెనకడుగు వేయలేదని విద్యార్థినులు తెలిపారు.
పిల్లలను విద్యార్థి దశ నుంచే ఆలోచింప చేయాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం అందించే దిశగా ప్రయోగాలు చేసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. హైస్కూల్ స్థాయిలో ప్రయోగాలు చేస్తే యువ శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
సాధారణంగా అందరూ తొక్కలంటే పనికి రాని వ్యర్థాలుగా చూసి పారేస్తారు. ఇలా పారేయ టం వల్ల కూడా పలు రకాల సమస్యలు వస్తాయి. అయితే ఆ వ్యర్థాలతో భూమిని సారవంతం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంటి వచ్చిందే ఈ ప్రయోగం అంటున్నారీ విద్యార్థినులు. నేలకు కావాల్సిన పోషకాలు అందించి సారవంతంగా చేసేందుకు తాము తయారు చేసిన పౌడర్ ఉపయోగపడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తమకు ఈ సక్సెస్‌తో సంతృప్తితోపాటు ఏదైనా చేయగయగలమనే నమ్మకం వచ్చిందని అంటున్నారు. వ్యవసాయ రంగంలో రైతుకు మేలు చేసే ఆవిష్కరణలు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని విద్యార్థినులు చెబుతున్నారు.