Students Emotional on Teacher Transfer in Mancherial: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లారు. దీంతో ఆ పాఠశాల విద్యార్థులు గురువును విడిచి ఉండలేకపోయారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో విద్యార్థులు తమ గురువు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటామని చెప్పి ఆయన బదిలీ అయిన పాఠశాలలో చేరారు. ఈ అరుదైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ 2012 జులైన 13న చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా అందులో ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ స్కూల్లోని పిల్లలతో ఆ టీచర్ ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించేవారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపడంతో 32 మందిగా ఉన్న విద్యార్థుల సంఖ్య 250కి చేరింది.
ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఆయన ఈనెల 1న ఇదే మండలంలోని మూడు కిలోమీటర్ల దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ముందు పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామాన్ని తట్టుకోలేక ఏడ్చారు. తమ మాస్టారు ఎక్కడ ఉంటే అక్కడే చేరతామని పిల్లలు గొడవ చేయడంతో 2,3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ పాఠశాలలో చేర్పించారు. దీంతో అంతకు ముందు కేవలం 21 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల నేడు 154 మందితో కళకళలాడుతోంది. కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
మీరు మరో చోటుకు వెళ్లొద్దంటూ కంటతడి పెట్టిన విద్యార్థులు : మరోవైపు నిర్మల్ జిల్లా మామడ మండలం ఆరెపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏళ్లుగా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు శిరీష్ కుమార్, ప్రకాశ్ రావు, శ్రీకర్ బదిలీపై వేరొక చోటు వెళ్తున్న క్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై మీరు మరో చేటుకు వెళ్లొద్దు ఇక్కడే ఉండాలంటూ బోరున విలపించారు. వారికి ఉపాధ్యాయులంతా కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
12 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు : నల్కొండ జిల్లా నార్కట్పల్లి ప్రాథమిక పాఠశాలలో వినీత అనే ఉపాధ్యాయురాలు 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా బదిలీపై మరో పాఠశాలకు వెళ్లనున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై తమను విడిచి వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు. పాఠశాలలో అభివృద్ధికి, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆమె ఎంతో కృషి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.