State Sarpanch Association Fires on YCP Government : పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను తక్షణమే ఇవ్వాలని లేకపోతే రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సర్పంచ్‌ల సంక్షేమ సంఘం నేతలు ప్రభుత్వాన్నిహెచ్చరించారు. నిధులు మంజూరు చేయాలని కోరుతూ తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ సుధాకర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకల పాపారావు మాట్లాడుతూ, పంచాయతీల అభివృద్ధికి మార్చిలో కేంద్ర ప్రభుత్వం రూ. 998 కోట్లు విడుదల చేసింది. డబ్బులు మంజూరై రెండు నెలలు అవుతున్నా నేటికీ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని పాపారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'గ్రామ పంచాయతీల నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది- ఆర్థిక మంత్రి బుగ్గన తప్పు ఒప్పుుకొన్నట్లే'
ప్రభుత్వానికి రెండు రోజులు సమయం ఇస్తున్నాం : మరోవైపు రాష్టంలో ఎండలు పెరిగిపోవడంతో నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. కేంద్రప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని గత నెల రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం ఇచ్చామని గుర్తుచేశారు. దీనిపై సాగుకూలంగా స్పందించిన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్ శాఖకు లేఖ రాసినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని పాపారావు మండిపడ్డారు.
భారీ ఎత్తున ఆందోళన చేపడతాం : దీనిపై మరోసారి తమ బాధను తెలిపేందుకు మరోసారి రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ సుధాకర్‌కు వినతి పత్రం అందించామని తెలిపారు. ప్రభుత్వానికి రెండు రోజులు సమయం ఇస్తామని ఆ తర్వాత రాష్ట్రంలోని సర్పంచులు అందరినూ తీసుకువచ్చి కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని పాపారావు తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
సొంత జిల్లాలో సీఎం జగన్‌కు షాక్- వైసీపీని వీడిన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి
పంచాయతీ నిధులను సీఎం జగన్ దారి మళ్లించారు : అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పంచాయతీ నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి దారి మళ్లించారని సర్పంచ్‌లు గత కొంత కిందట రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ నిధులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దోచుకుని సొంత అవసరాలకు వాడుకోవడంతో పల్లెల్లో అభివృద్ధి కరువైందని సర్పంచ్‌లు విమర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పంచాయతీలు ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడాయి.
సర్పంచ్‌లు రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది : జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12,918 గ్రామాల్లోని 3 కోట్ల 50 లక్షల మంది ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన సర్పంచ్‌లు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో చివరకు సొంత నిధులు వెచ్చించి పనులు చేశారు. మరికొందరు ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి చేశారు. చివరికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాక సర్పంచ్‌లు రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది.