Stagnant Irrigation of Kommamuru Canal : గుంటూరు జిల్లాలో ఏటా మూడు పంటలతో కళకళలాడిన కొమ్మమూరు కెనాల్ ఆయకట్టులోని పొలాలు నేడు సాగునీరందక బీడు భూముల్ని తలపిస్తున్నాయి. నీటి ఎద్దడితో అనేక మంది రైతులు సాగుకు దూరం కాగా ఆశ చావక రబీలో వరి వేసిన అన్నదాతలు చేతికందివచ్చిన పంటను కాపాడుకునేందుకు అష్టాకష్టాలు పడుతున్నారు. కొమ్మమూరు కెనాల్‌కు ఫిబ్రవరిలోనే నీటి సరఫరా నిలిచిపోవడంతో పక్కనే ఉన్న నల్లమడ డ్రెయిన్ నుంచి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు
Guntur District : కరవు అంటే వినడమే కానీ ఎన్నడూ చూడని గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతపు రైతులు పాలకులు, అధికారుల ముందుచూపు లేమితో దుర్భిక్షంతో అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఖరీఫ్, రబీ పంటలకు ఎక్కువగా సాగర్ కాలువ నుంచి సాగునీరు అందుతోంది. నీటి సమస్య లేనందున అన్నదాతలు మూడో పంటను కూడా వేస్తుంటారు. అలాంటిది ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పాటు సాగర్ నుంచి సాగునీరు సరఫరా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకుమాను మండలం అప్పాపురం మీదుగా ప్రవహించే కొమ్మమూరు కాలువకు నీటి సరఫరా ఫిబ్రవరిలోనే నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ ఇలా నిలిపివేసిన దాఖలాలు లేవని మార్చి, ఏప్రిల్ నెలలోనూ సరఫరా కొనసాగేదని రైతులు తెలిపారు. నెలన్నర ముందుగానే నిలిపివేయడంతో రబీలో వేసిన వరి పంట నీరు లేక ఎండిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జనానికి అరుంధతి నక్షత్రాన్ని చూపించిన జగన్ ! - పెళ్లిరోజు హామీకి నాలుగేళ్లు
Crop Irrigation : కాకుమాను మండలంలో కొమ్మమూరు కాలువ పరిధిలో వందలాది ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇప్పటికే 30 నుంచి 40 వేలు పంటకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు బీటలు వారిన పొలాలకు నీరు పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎండిపోయిన కొమ్మమూరు కెనాల్ మధ్యలో 2 లక్షల రూపాయలతో చిన్నపాటి కాలువ తవ్వుకుని అప్పాపురం వంతెన సమీపంలో ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకున్నారు. నాలుగైదు రోజులుగా రాత్రింబవళ్లు నల్లమడ వాగు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆ నీటిని కెనాల్ లోని చిన్న కాలువ ద్వారా కిలోమీటర్ల మేర తరలించి పంటలకు పెడుతున్నారు. ఇందుకోసం రోజుకు దాదాపు పదివేల రూపాయలకు పైగానే ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నీరు లేకపోతే పైరులు ఎండిపోతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగు నీటి కష్టాలు - పంటలు వేసేందుకు అన్నదాతల విముఖత
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామంటున్న రైతులు డిసెంబర్ లో తుపాన్ వల్ల నష్టపోయామని వాపోతున్నారు. రబీలోనూ తీవ్ర నీటి ఎద్దడితో పంట చేతికొచ్చే పరిస్థితి లేదంటున్నారు.