Sri Rama Navami Celebrations in Shirdi : షిర్డీ సాయి మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు షిర్డీకి తరలి వచ్చారు. షిర్డీలో సాయి సమ్మతితో ప్రారంభమైన రామనవమి ఉత్సవాల్లో ఈరోజు ప్రధాన రోజు. తెల్లవారుజామున సాయి మందిరంలో సాయికి కాకడ హారతి నిర్వహించి, సాయి భక్తులు తెచ్చిన గోదావరి నీటితో సాయి విగ్రహానికి స్నానం చేయించారు.
సాయి మందిరాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించారు. సాయి ఆలయ ప్రాంతంలో ద్వారకామాయి మండలం వారు ఏర్పాటు చేసిన రామ, లక్ష్మణ, హనుమంత విగ్రహాలతో కూడిన మహాద్వారం, విద్యుద్దీపాలంకరణ భక్తులను ఆకర్షిస్తోంది.
'షిర్డీలో మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు నిర్వహిస్తాము. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు, నేడు దైవ దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారు. శ్రీ రామ నవనమి సందర్భంగా భక్తులు గోదావరి నుంచి నీరు తీసుకువచ్చి బాబాకు జలాభిషేకం చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సాయి సమాధి పక్కన వేదికపై రాముడు కొలువుదీరుతాడు. పూజా, కీర్తన కార్యక్రమాల అనంతరం బాబా, రాముడి ప్రతిమలు ఊరేగింపుగా తీసుకువెళ్తాం. సాయి భక్తుల కోసం ఆలయం రాత్రంతా తెరిచి ఉంటుంది.' - బాలకృష్ణ జోషి, సాయి మందిర మాజీ పూజారి
'రామనవమి వేడుకల సందర్భంగా భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు సౌకర్యవంతమైన షెడ్లు, తాగునీరు, ఆహార సదుపాయాలు అందుబాటులో ఉంచాం. ఈ ప్రత్యేకమైన రోజు భక్తుల కోసం రాత్రంతా మందిరం తెరిచే ఉంటుంది.' -సుధాకర్ యార్లగడ్డ, సాయిబాబా ట్రస్ట్ ఛైర్మన్
Sri Rama Navami Festival : షిర్డీలో మూడు రోజుల పాటు రామనవమి ఉత్సవాలు జరుగుతాయి. రామనవమి పండుగ మొదటి రోజున ద్వారకామాయిలో తెల్లవారుజాము నుంచి జరుగుతున్న సాయిచరిత్ర పారాయణం ఈ రోజు ఉదయం ముగిసింది. అనంతరం సాయి సచరిత్ర గ్రంథాన్ని ఊరేగించారు. ఈ రోజు సాయి విగ్రహాన్ని బంగారంతో, సమాధి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించారు. రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి వచ్చిన సాయి భక్తుల సాయినామ ధ్వనులతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. సాయి భక్తులు తీసుకొచ్చిన గంగాజలంతో సాయి విగ్రహానికి స్నానం చేయించారు. అనంతరం సాయిమూర్తిని బంగారు ఆభరణాలతో అలంకరించారు.
అయోధ్య రాముడి కోసం షిర్డీలోని వృద్ధుల సంకల్పం - ప్రతి రోజూ 11 గంటల పాటు భజన