Spiritual Preacher Chaganti Koteswara Rao Exclusive Interview : దేశానికి, సమాజానికి వ్యక్తి బాగా ఉపయోగపడేది యువకుడిగా ఉన్నప్పుడనని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. వృద్ధుడు అయ్యాక అయ్యో మనకు తెలియక ఆ తప్పులు చేశామని అనుకున్నా పశ్చాత్తాపం మిగులుతుంది తప్ప చేయడానికి ఏమీ ఉండదని తెలియజేశారు. ఏం చేయాలన్నా యువకులుగా ఉన్నప్పుడే చేయాలని హితువు పలికారు. యువత సన్మార్గంలో నిలదొక్కుకుంటే వారికి, వారి కుటుంబానికి, దేశానికీ కీర్తి వస్తుందని వ్యాఖ్యానించారు. మహనీయుల స్ఫూర్తితో యువత అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. పది మంది కోసం బతకడం అలవర్చుకోవాలన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే విషయమై ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆయన ఈనాడు, ఈటీవీ భారత్‌తో ఆదివారం ముచ్చటించారు.
నిగ్రహం, సంయమనం తప్పనిసరి : కారుకు బ్రేకు, యాక్సిలరేటర్ ముఖ్యమే. యాక్సిలరేటర్ ఉండి బ్రేకు లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. బ్రేకు ఒకటే ఉండి యాక్సిలరేటర్ లేకపోతే కారు ఎలా ముందుకు వెళ్లదో యువతా కూడా అంతే. కావాల్సిన స్పీడ్‌లో వెళ్లాలంటే ఉత్సాహం, సమర్థత రెండూ ఉండాలి. ఓ పని చెయ్యకూడదు అన్నప్పుడు ఆగగలిగే నిగ్రహం, సంయమనం నేటి యువతకు ఉండాలి. బ్రేకు, యాక్సిలరేటర్ ఉన్న కారు ఎలా ఉపయోగపడుతుందో నిగ్రహం, సంయమనం ఉన్న యువకులు ఈ దేశానికి ఉపయోగపడతారు.
విద్య, నైతిక విలువలపై.. చాగంటి ఏమన్నారంటే..?
విద్యార్థి దశ నుంచే శోధన : దేశం అంటే ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు. కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహాకవులు, బాలమురళీకృష్ణ లాంటి సంగీత విద్వాంసులు, అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు ఇలా అన్ని రంగాల్లో రాణించినవారూ అవసరమే. దేశానికి కావాల్సిన వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి. వాటితో మంచి పరిశోధనలు చేసి దేశ అవసరాలు తీర్చి కొత్త విషయాలు కనిపెట్టగలిగితే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం. ఇందులో యువతే కీలక భూమిక పోషించాలి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా నిబద్ధత, నైతిక విలువలు పాటించాలి. వాటిని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి.
తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిది : పిల్లల అభిరుచి తల్లిదండ్రులకు తెలిసినట్లు మరి ఎవ్వరికీ తెలియదు. రవీంద్రనాథ్ ఠాగూర్‌కు రచనల్లో అభిరుచి ఉందని ఆయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గ్రహించారు. బాల మురళీకృష్ణకు సంగీతం పట్ల అభినివేశం ఉందని ఆయన తండ్రి, గురువు తెలుసుకున్నారు. సచిన్ తెందూల్కర్ చిన్నతనంలో స్ట్రైట్ డ్రైవ్ కొట్టడానికి అస్తమానం బౌలింగ్ చేసేవారు ఉండరని, గడపకు చిన్న తువ్వాలు కట్టి, దాంట్లో బంతి పెట్టి స్ట్రైట్ డ్రైవ్ సాధన చేస్తుంటే అన్న, తండ్రి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం దేశానికి ఒక రత్నాన్ని అందించింది. పిల్లల్లోని నైపుణ్యాన్ని, అభిరుచిని గుర్తించి ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మంచి ఉద్యోగులు, కవులు, గాయకులు, నిపుణులు, శాస్త్రవేత్తలు అందరూ వస్తారు.
గురువు పాత్ర అనన్య సామాన్యం : గురుస్థానం పరమ పవిత్రం. అనన్య సామాన్యం. తల్లిదండ్రుల్లాగే గురువుకూ పిల్లల అభిరుచి, నైపుణ్యం తెలుస్తాయి. గురువు చెప్పిన పాఠాలు పిల్లల మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. ప్రాథమిక పాఠశాల స్థాయిలో గురువుల నడతను పిల్లలు బాగా గమనిస్తారు. నేర్చుకున్న దాన్ని సమాజానికి వాడుకోవాలని వశిష్టుడు, విశ్వామిత్రుడు చెప్పినట్ల్లు చెప్పగలిగితే వాళ్లు తమకు విద్య వల్ల కలిగిన గొప్ప పదవులను దుర్వినియోగం చేయకుండా సమాజానికి వాడతారు.
గురజాడ విశిష్ట పురస్కారాన్ని.. ఆశీర్వచనంగా స్వీకరిస్తున్న: చాగంటి
అది పరాజయం కాదు : ఏదైనా పని మొదలుపెడితే అది వెంటనే సఫలమైపోతుందని చెప్పలేం. వైఫల్యాలు వచ్చినా కుప్పకూలిపోకూడదు. పరాజయం జీవితంలో ఒక భాగం. అందుకే ఫెయిల్ అనే పదానికి ‘ఫస్ట్ ఎటెంప్ట్ ఇన్ లెర్నింగ్’ అని అబ్దుల్ కలాం గొప్పగా వివరించారు. పరాజయాన్ని ఒక అనుభవంలా తీసుకోవాలని తెలియజేశారు.
పెద్దలే బుద్ధులు నేర్పాలి : మా తరానికి ఈ తరానికి చాలా తేడా ఉంది. నా చిన్నతనంలో టెలిఫోన్ ఉంటే గొప్ప. ఇప్పుడు మొబైల్ఫోన్లు , వీడియోకాల్స్ అందుబాటులోకి వచ్చాయి. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలకు ఏది మంచో, ఏది చెడో మనమే వారికి తెలియజేయాలి. మొబైల్ఫోన్లు కాదు ఏ వస్తువునైనా ఎంతవరకు ప్రయోజనకరమో అంతవరకే ఆరోగ్యకరంగా ఉపయోగించుకోగలిగితే మేలు. అది తెలిస్తే వారు బాగా వాడుకుని వృద్ధిలోకి వస్తారు. ప్రతి ఒక్కరిలో చిన్నచిన్న దోషాలు ఉంటాయి. వాటిని పెద్దవాళ్లే చక్కదిద్దాలి.
నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఒప్పుకొన్నా : ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యత నాకు అప్పగిస్తూ సలహాదారుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను. నా అంగీకారం పదవుల కోసం కాదు. నాకు ఇప్పుడు ఏ గౌరవం తక్కువయ్యిందని? నా వయసు 65 ఏళ్లు. ఆరోగ్యకరంగా ఏమైనా చెయ్యగలిగేది మరో ఐదారేళ్లు. ఈ లోగా నేను అన్నివేల మంది పిల్లలను కూర్చోబెట్టలేను. ప్రభుత్వపరంగా వాళ్లు కూర్చోబెడితే నేను నాలుగు మంచిమాటలు చెప్పగలను. అందుకే ఒప్పుకొన్నాను. నేను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది? అందుకే ప్రభుత్వం అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించాను.
Chaganti Koteswara Rao: "భక్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు"