Speaker on Assembly and MLA Quarters: రాజధాని ప్రాంతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యటించారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన ఆయన తొమ్మిది నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి వారికి అప్పగిస్తామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలను పరిశీలించిన స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్, విష్ణుకుమార్‌రాజు, అధికారులు పాల్గొన్నారు.
ఈ క్రమంలో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న ఓ నాయకుడి అనాలోచిత పాలన వల్ల అమరావతి శిథిలావస్థకు చేరిందని విమర్శించారు. టీడీపీ హయాంలో వేగంగా జరిగిన భవనాల నిర్మాణం పనులు వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని మండిపడ్డారు. అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు.
భవనాల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి కూడా దొంగిలించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ క్రమంలో నిర్మాణాల పూర్తికి రూ.380 కోట్లు అదనపు భారం అవుతుందని తెలిపారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులను కోరినట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న గ్రంథాలయం నిర్మాణం, డైనింగ్ హాల్‌లను వెంటనే పూర్తి చేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించారు.