SIT Probes Illegal Smuggling of Ration Rice From Kakinada Port : రేషన్ బియ్యం అక్రమ రవాణా మూలాల శోధనకు సిట్ త్వరలోనే రంగంలోకి దిగనున్న నేపథ్యంలో మాఫియా గుండెల్లో గుబులు మొదలయింది. దీంతో కార్మికులకు ఉపాధి పోతుంది, ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలిస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది.
రాష్ట్రంలో పలు పోర్టులున్నా కాకినాడ పోర్టులే తరచూ రచ్చకెక్కుతున్నాయి. గత ఐదేళ్లూ ఈ పోర్టుల నుంచి రేషన్ మాఫియా చేసిన పేదల బియ్యం అక్రమ ఎగుమతులపైనే చర్చంతా సాగుతోంది. తెరవెనుక ఎవరున్నారన్నది తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో వేడి పెరిగింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని బృందం త్వరలో కాకినాడ రానుంది. దర్యాప్తు ప్రారంభించే ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశం కానుంది. ఇక్కడి పరిస్థితిపై ఓ స్పష్టతకు వచ్చాక పీడీఎస్ అక్రమాలపై నమోదైన 13 కేసులతోపాటు, ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు. రాబోయే 2-3 రోజుల్లో సిట్ జిల్లాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌పై సీఐడీ విచారణ జరుపుతోంది. తాజాగా కాకినాడ సీపోర్టులో విచారణ జరిపి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. పోర్టులో వాటాలు చేతులు మారడం ఎగుమతులు- దిగుమతుల లోతెంత అనే అంశాలపై దృష్టి సారించారు. మరోవైపు కాకినాడ తీరం నుంచి బియ్యం నిల్వలతో పశ్చిమ ఆఫ్రికా వెళ్లే ‘స్టెల్లా ఎల్ పనామా’ నౌకలో రేషన్ బియ్యం నిల్వలున్న ఆరోపణలపై కీలక శాఖల బృందం విచారణ జరిపింది.
బియ్యం నమూనాల ఫలితాలపై స్పష్టత వస్తేగానీ నౌక కదలికపై ప్రతిష్టంభన తొలిగేలా కనింపించడంలేదు. కాకినాడ పోర్టులో అక్రమాలపై ఎప్పుడు ప్రభుత్వం దృష్టి సారించినా, అధికారులు తనిఖీలు చేసినా ఇక్కడ కార్మికులకు ఉపాధి పోతుంది. రవాణా స్తంభిస్తోంది. ఎగుమతులకు ఆటంకం కలుగుతోందన్న వాదననే మాఫియా తెరపైకి తెస్తోంది. ప్రతిసారీ ఈ వ్యూహంతోనే పోర్టు జోలికి ఎవర్నీ రానీయకుండా అడ్డుకట్ట వేస్తోంది. ఇప్పుడూ అదే మైండ్ గేమ్‌ను తెరమీదకు తెచ్చింది. కొన్ని ఎగుమతి, వ్యాపార సంస్థలు, ఇతరత్రా వ్యవస్థలతో ఈ వాదన బలంగా వినిపించేలా కొందరు పావులు కదుపుతున్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - కాకినాడ పోర్టు 'పుష్ప' ఎవరు?
పోర్టులోకి అడుగు పెట్టనీయకుండా రెండు నెలలుగా తనను అడ్డుకుంటున్నారని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తనిఖీల సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన పనామా ఎల్ నౌకలోకి ఎక్కి బియ్యం పరిశీలిద్దామంటే కూడా ఆటంకాలు కల్పించారు. దీంతో ఇక్కడ పరిస్థితి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. తాజా పరిణామాలతో మాఫియాలో కీలక వ్యక్తులెవరు? వారికి సహకరిస్తున్న వ్యవస్థలేవి? వెనుక ఎవరెవరు ఉన్నారు అని ప్రభుత్వం ఇప్పటికే నిఘా వ్యవస్థ ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో పోర్టు, కస్టమ్స్, పోలీసు, పౌరసరఫరాలు, రెవెన్యూ ఇతరత్రా శాఖలు నిఘా పెంచక తప్పలేదు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ బియ్యం అక్రమ నిల్వలు పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితి మింగుడుపడని అక్రమార్కులు కొన్ని వర్గాలను రెచ్చగొట్టి, ప్రభుత్వ చర్యలకు కళ్లెం వేసేందుకు సిద్ధమవుతున్నారు.
బియ్యం అక్రమ రవాణాపై సిట్ - 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం