SIT investigation Start in AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నిందుతులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో కొందరు కీలక నేతలను అరెస్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ బృందం నేరుగా విచారణ జరుపుతోంది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించింది. అల్లర్ల ఘటనలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సిట్‌కు చేరినట్లు సమాచారం.
రాష్ట్రంలో అల్లర్లపై సిట్ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation
Tirupati District: దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణ బృందం తిరుపతిలో పద్మావతి మహిళా వర్సిటీలో (Padmavati Women University) విచారణ చేపట్టారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై (Chandragiri TDP candidate Pulivarthi Nani) తిరుపతి మహిళా వర్సిటీ ప్రాంగణంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రవి మనోహరాచారి బృందం ఆ రోజు జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి తీసుకున్నారు. దీనిపై త్వరలోనే నివేదికను సమర్పించనున్నారు.
Anantapur District: అనంతరం తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడులు, ఘర్షణలపై విచారణ చేపట్టేందుకు సిట్ బృందం విజయవాడ నుంచి అనంతపురం చేరుకుంది. తాడిపత్రిలో పోలింగ్ రోజు, మర్నాడు జరిగిన ఘర్షణలపై దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. తాడిపత్రిలో రాళ్ల దాడులు, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో రెండ్రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిట్ బృందం విచారించనుంది. ఆదివారం ఉదయం తాడిపత్రిలో, ఆ తర్వాత అనంతపురంలోనూ విచారణ చేపట్టనున్నారు.
మరికొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ (IG Vineet Brijlal) నేతృత్వంలోని బృందం దర్యాప్తు పునఃసమీక్ష చేస్తోంది. ఆయా జిల్లాల్లో అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.