Sheeba From Sattenapalle: ఈ లోకంలో తల్లిని మించిన యోధులెవ్వరూ లేరు. కన్నబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. బిడ్డకు జన్మనిస్తే ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఆమె వెనకడుగు వేయలేదు. పసికందు బతుకుతుందో లేదో చెప్పలేమని వైద్యులు చెప్పినా బిడ్డే లోకమనుకుంది. పసిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మామూలు మనిషిని చేసింది. బయటకు అడుగుపెట్టే అవకాశం లేని కుమార్తెను ఉత్తమ విద్యార్థినిగా మలిచి కన్నతల్లి ప్రేమకు అసలైన నిర్వచనంగా నిలుస్తోంది.
సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలీ కేరళకు చెందిన షీబాను 2007లో వివాహం చేసుకున్నారు. షీబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తల్లి కావడం కష్టమని వైద్యులన్నారు. గర్భం దాల్చినా అబార్షన్ చేయడం మంచిదని, లేనిపక్షంలో తల్లికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అందుకు అంగీకరించని షీబా, ఎంత కష్టమైనా బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. 2017లో కేరళలోని మలప్పురం ఆస్పత్రిలో ఐదు నెలల బిడ్డకు జన్మనిచ్చింది. 500 గ్రాముల బరువుతో.. అనారోగ్య సమస్యలతో అయత్ పుట్టడంతో బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. పాపను బతికించుకోవాలనే ఏకైక లక్ష్యమే ఆమెను ముందుకు నడిపింది. జీవనోపాధి కోసం మస్తాన్ సౌదీ వెళ్లగా, బిడ్డను రక్షించుకోవడానికి షీబా ఒంటరిగానే శ్రమించారు. ఏడాది పాటు ఇంట్లోని ప్రత్యేక గదిలో గుండె సంబంధ పరికరం అమర్చి ఇంక్యుబేటర్‌లో బిడ్డను కంటికి రెప్పలా చూసుకుని పునర్జన్మనిచ్చింది.
అయత్‌కు ఆరేళ్లు రాగానే కేరళలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. గతేడాది 197 రోజులు తరగతులు నిర్వహించగా, ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా బడికి వెళ్లడం వెనుక మరో కథ ఉంది. నాలుగేళ్ల వరకూ అయత్‌కు మాటలు రాలేదు. టీవీలో షారూక్ ఖాన్ పాటలు చూస్తూ, షారుఖ్ అని పిలుస్తూ మాట్లాడింది. షారుఖ్‌లా టీవీలో కనిపించాలంటే ఏం చేయాలని తల్లిని అడిగింది. రోజూ పాఠశాలకు వెళ్లి బాగా చదువుకోవాలని చెప్పడంతో, అయత్ సెలవు పెట్టకుండా బడికి వెళ్లింది. అరుదైన వ్యాధితో బాధ పడుతూ బడికి వెళ్లే చిన్నారిగా అయత్ రికార్డు సృష్టించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా పలు సంస్థల రికార్డులు అయత్‌ను వరించాయి. అయత్‌ను చూసి తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయత్‌ను కలెక్టర్ చేయాలని ఆశయంగా పెట్టుకున్నారు.
"ఈ పాప ఇప్పుడు ఇన్ని అవార్డులు తీసుకుంది. ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఒక్క రోజు కూడా స్కూల్‌కి వెళ్లడం ఆపలేదు. అందుకు గాను తనకి పలు అవార్డులు ఇచ్చారు. మా ఫ్యామిలీ అంతా మాకు సపోర్టుగా ఉన్నారు. షారుఖ్ ఖాన్, రాహుల్ గాంధీని చూడాలని తనకి రెండు డ్రీమ్లు ఉన్నాయి. వాటిని తీర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం". - మస్తాన్ వలి, అయత్ తండ్రి