Pensioners Died in Andhra Pradesh : నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. కాలే కడుపులతో ఆశగా బ్యాంకులు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పండుటాకులు రాలిపోతున్నాయి. మండుతున్న ఎండల్లో దూర ప్రయాణాలు చేస్తూ చివరకు వారు కనిపించని లోకాలకు చేరుకోవాల్సి వస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా మరో ఏడుగురు తనువు చాలించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదాంతం.
కారంపూడి : పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన షేక్ మౌలాబి (80) తన కుమారుడి సాయంతో సచివాలయం-2 వద్దకెళ్లి గంటపాటు వేచి ఉండి పింఛను తీసుకున్నారు. ప్రయాణంలో వడదెబ్బకు గురయ్యారు. శనివారం ఉదయం అచేతనంగా పడుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు.
జగన్ రాజకీయ క్రీడ - ఏడుగురు పింఛన్‌దారులు మృతి - Pension Distribution Issue
నెల్లూరు జిల్లాలో ఇద్దరు మృతి : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కచ్చేరిమిట్ట ప్రాంతానికి చెందిన గద్దె వైనమ్మ (65) పింఛను డబ్బులను బ్యాంకు నుంచి ఎండలో తెచ్చుకున్నాక అస్వస్థతకు గురవడంతో బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. ఇదే జిల్లా సైదాపురం మండలం లింగనపాళెం గ్రామానికి చెందిన వెంకట్రాజు (80) నెల్లూరులో కుమారుడి వద్ద ఉంటున్నారు. పింఛను కోసం శనివారం స్వగ్రామమైన లింగనపాళెం బయల్దేరారు. సచివాలయ సిబ్బంది మార్గమధ్యలో సైదాపురంలో పింఛను ఇచ్చారు. ప్రయాణంలో వేసవి తాపంతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు.
వైఎస్సార్ జిల్లాలో ముగ్గురు మృతి : వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లెకు చెందిన పింఛనుదారు గోనే గురివిరెడ్డి (65)కి రెండు బ్యాంకు ఖాతాలున్నాయి. వృద్ధాప్య పింఛను కోసం శుక్రవారం మండేఎండలో బద్వేలులోని బ్యాంకు చుట్టూ తిరిగారు. అక్కడ నగదు జమ కాలేదనడంతో బి.కోడూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లి పింఛను పొందారు. ఇంటికెళ్లాక వడదెబ్బతో స్పృహ తప్పి చనిపోయారు. మరో సంఘటనలో ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ఎం.ఓబన్న(80) ఎండలో బ్యాంకు వద్దకెళ్లి నీరసించి వడదెబ్బతో చనిపోయారు. ఇదే జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డిపల్లె పంచాయతీ సోగలపల్లె గ్రామానికి చెందిన వృద్ధుడు కె.వెంకటన్న (75) పింఛను డబ్బులకు రెండు రోజులుగా నందిమండలం బ్యాంకుకు వెళ్లగా ఖాతాకు సొమ్ము జమ కాలేదన్నారు. ఇంటినుంచి బ్యాంకుకు మండే ఎండల్లో తిరిగే క్రమంలో వడదెబ్బకు గురయ్యారు. కడప ఆసుపత్రికి తరలిస్తుండగా రాత్రి చనిపోయారు.
కంకిపాడు : కృష్ణా జిల్లా కంకిపాడులోని పులిరామారావునగర్‌కు చెందిన లోయ మల్లయ్య (72) పక్షవాతంలో మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు. కుటుంబసభ్యులు 2వ తేదీన సంబంధిత సచివాలయానికి వెళ్లి పింఛను కోసం వాకబు చేయగా బ్యాంకు ఖాతాలో జమయిందని చెప్పారు. ఖాతా పుస్తకం ఇంట్లో కనిపించలేదు. ఆధార్‌కార్డుతో బ్యాంకుకు వెళ్లగా ఖాతా మనుగడలో లేదని, రూ.వంద చలానా కట్టాలని సూచించారు. ఏ నంబరుకు జమచేయాలో తెలియక మళ్లీ ఇంటికి వచ్చారు. ఈలోగా ఎండలకు తాళలేక అస్వస్థుడై శనివారం మరణించారు.
పింఛను కోసం వృద్ధుడి పాట్లు : మండుటెండలో పింఛను కోసం వృద్ధులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కళ్లులేని, నడవలేని వృద్ధులను సైతం అధికారులు బ్యాంకుకు రప్పిస్తున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం పంచాయతీ పరిధి నేల్తేరు గ్రామానికి చెందిన కడియం వీరభద్రం(70) ఏడాదిగా మంచానికే పరిమితమయ్యారు. కళ్లూ కనిపించవు. పింఛను కోసం సచివాలయానికి వెళ్లగా బ్యాంకుకు వెళ్లాలని సిబ్బంది సూచించారు. ఆటోలు అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకురాలు ఓ యువకుడి సాయంతో ద్విచక్రవాహనంపై ఆనందపురం బ్యాంకుకు తీసుకొచ్చారు. అక్కడ మూడు గంటలపాటు వేచి ఉండి పింఛను సొమ్ము పొందాల్సి వచ్చింది.