Pensioners Died in Andhra Pradesh : ముఖ్యమంత్రి గారూ పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అభాగ్యులు మండుటెండల్లో మలమలమాడిపోయేలా చేసి రాక్షసానందం పొందుతారా? ఇది కుట్ర కాదా? ఇవీ పింఛనుదారుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. బ్యాంకుల్లో నగదు జమకాక కొందరు, ఏ ఖాతాలో జమయిందో తెలియక కొందరు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. మూడో రోజైన శుక్రవారమూ బ్యాంకుల వద్ద పింఛనుదారుల కష్టాలు అన్నీఇన్నీ కావు.
Seven People Died Due to Pension Problems : పింఛను నగదును వేరే వారి ఖాతాల్లో జమ చేయడమంటే ఎంత ఘోరం? అచ్చంగా జగన్ ఇదే చేశారు. పింఛనుదారుల ఆధార్ నంబర్ మిస్‌మ్యాచ్ అయిన బ్యాంకు ఖాతాలు వేలల్లోనే ఉన్నాయి. ఇలాంటివారికి ఇంటికే పింఛను ఇవ్వకుండా నేరుగా ఖాతాల్లోకి నగదు జమ చేశారు. దీంతో ఆ మొత్తం పింఛనుదారుల ఖాతాల్లో కాకుండా వేరే వారి ఖాతాల్లోకి వెళ్లింది. ఆ వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు. వారందరూ పింఛను నగదు ఖాతాలో జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. జగనన్న కాలనీల్లో గుత్తేదారుల ద్వారా ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తుందని చెప్పి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆ గుత్తేదారుల ఖాతాలకు అనుసంధానం చేయించింది. గృహనిర్మాణ లబ్ధిదారుల్లో వేల మంది పింఛను తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారి ఖాతాల్లోని పింఛను నగదును జమ చేయగానే అది గుత్తేదారుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. ఆ గుత్తేదారులెవరో? ఎక్కడుంటారో? తెలియక పింఛన్‌దారులు మనోవేదనకు గురవుతున్నారు.
బ్యాంకుల చుట్టూ తిరిగి - ప్రాణాలు విడిచిన అవ్వాతాతలు - Pensioners died in Andhra Pradesh
పింఛనుదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని వాటి లెక్కను ప్రభుత్వం ముందే సేకరించలేదు. మిస్ మ్యాచ్ అయినవాటి లెక్క తేల్చలేదు. 2, 3 బ్యాంకు ఖాతాలుంటే ఏ ఖాతాలో నగదు జమ చేసేది ముందు చెప్పలేదు. ఇవన్నీ పింఛనుదారులకు ఇబ్బందులు లేకుండా చేసేవే. వీటన్నింటినీ పట్టించుకోని జగన్ చనిపోయినవారి డేటాను మాత్రం పక్కాగా సేకరించారు. అవ్వాతాతల మృతికి విపక్షాలే కారణమంటూ నెపాన్ని వారిపై మోపి చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమ చేయకుండా జాగ్రత్తపడ్డారు. దివ్యాంగులు, నడవలేనివారు, తీవ్ర అస్వస్థతకు గురైనవారు, మంచాన ఉన్నవారికి ఇళ్ల వద్దనే పింఛను పంపిణీ చేస్తామని ఆదేశాలిచ్చిన జగన్ దాన్ని అమలు చేయలేదు.
కాకిలెక్కలేవో వేసి కొంతమందికి ఇళ్ల వద్ద అందించారు. వైకల్యం కళ్లకు కట్టినట్టు కనిపించే దివ్యాంగులను బ్యాంకులకు రప్పించి వేదనపడేలా చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారినీ తన కర్కశత్వానికి బలిపెట్టారు. 80ఏళ్లు దాటిన వృద్ధులను వదిలిపెట్టలేదు. ఇలాంటి పింఛనుదారులందరినీ బ్యాంకులచుట్టూ తిరిగేలా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బ్యాంకులు రుణ బకాయిలకు పింఛను నగదు మళ్లించుకున్నాయి. బ్యాంకులకు ఆశగా వెళ్లిన వృద్ధులు ఆ సొమ్మును రుణం నుంచి మినహాయించుకున్నామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. పలుచోట్ల సాంకేతిక కారణాలతో పింఛన్ల పంపిణీని నిలిపేశారు. మన్యం జిల్లాలో బ్యాంకులకు చేరుకునేందుకు గిరిజన ప్రజలకు ఒక్కొక్కరికి అదనంగా 400 వరకూ ఖర్చయింది.
పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద నిరీక్షణ- మండుటెండలో అవ్వాతాతల అవస్థలు - Pension Problems in AP
ఏప్రిల్‌లో పింఛను పంపిణీ సందర్భంగా బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు వీలే కాదని జగన్ ప్రభుత్వం చెప్పింది. చాలా మంది పింఛనుదారులకు ఖాతాలే లేవంది. ఒకవేళ ఖాతాలున్నా మనుగడలో లేకుండా ఉండే అవకాశాలున్నాయనీ సమర్థించుకున్నారు. ఆధార్‌కార్డు అనుసంధాన సమస్యా ఉంటుందని తెలిపారు. కానీ మే నెలలో పింఛను నగదును బ్యాంకుల్లో జమ చేసే ముందు వీటిలో ఏ ఒక్కటీ పరిష్కరించకుండానే ఖాతాల్లో డబ్బు వేశారంటే ఇది కుట్రే కాక మరేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జగన్, జవహర్‌రెడ్డి కూడబలుక్కునే ఇదంతా చేశారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. పింఛనుదారుల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టేలా సీఎస్‌తో కలిపి వ్యూహం పన్నిన జగన్ దాన్ని తెలుగుదేశంపై నెట్టేందుకు వైసీపీ సైన్యం, పేటీఎం బ్యాచ్, రాజీనామా చేసిన వాలంటీర్లు, సొంతపార్టీ ఎమ్మెల్యేల అనుచరులను ముందస్తుగానే రంగంలోకి దింపారు. చేసిదంతా తానే చేసి చంద్రబాబు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించారు. ఫోన్‌లకు ఆడియో మెసేజ్‌లు పంపుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఇతర ఆ పార్టీ ఎమ్మెల్యేలూ ఇదే దుష్ప్రచారానికి తెగబడ్డారు.